హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తమకు ఏ పార్టీతోనూ జట్టులేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టుడు ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆమె ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు కేవలం సర్వేల్లోనే గెలుస్తాయని, తాము ఎన్నికల్లో గెలుస్తామని చెప్పారు.
బీజేపీ బీసీ సీఎం జపం ఎన్నికల గిమ్మికేనని అన్నారు. ట్విట్టర్ వేదిక ‘ఆస్ కవిత’ కార్యక్రమం ద్వారా శనివారం ఆమె నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ బీజేపీ బాధ్యతల నుంచి బీసీని తప్పించి ఓ అగ్రవర్ణం నేతకు అప్పగించారని, కేంద్ర సర్కార్ బీసీ కులగణన చేపట్టేందుకు జంకుతున్నదని, మహిళా రిజర్వేషన్లలో బీసీలకు కోటా ఇవ్వలేదని ఆమె బీజేపీపై ధ్వజమెత్తారు. ఇవన్నీ పట్టించుకోని బీజేపీ రేపు అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
ఈడీ కేసుపై ధైర్యంగా కొట్లాడుతా
ఢిల్లీ మద్యం కేసులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయంటూ కవిత తీవ్రంగా స్పందించారు. ‘రాజకీయ కుట్రలో పావును కాను. ధైర్యంగా కొట్లాడే పోరాటపటిమ నాకు ఉంది’ అని తేల్చిచెప్పారు. ఢిల్లీ మద్యం విధానంలో తన పాత్ర ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ వయస్సులో చంద్రబాబు అరెస్టు కావడం దురదృష్టకరమని, ఆయన కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న బాధను తాను అర్థంచేసుకోగలనని నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
‘గాంధీ’లతో తెలంగాణకు అన్యాయమే
తెలంగాణ ప్రజలు ఆలోచనాపరులని, పదేండ్ల ప్రగతిని గమనించారని కవిత చెప్పారు. బాధ్యత ఉన్న ప్రభుత్వాన్ని.. భరోసా ఇచ్చే నాయకుడిని మళ్లీ ఆశీర్వదించి ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లినట్టు.. కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఉన్నదని ఎద్దేవా చేశారు. తామే గెలస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సర్వేల్లో ఊదరగొడుతున్నదని, ఇదే ట్రిక్‌ను 2018లో కూడా చేశారని గుర్తుచేశారు.
రాహుల్ గాంధీ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ తెలంగాణను ఆంధ్రతో కలపడం వల్ల 60 ఏండ్ల్లు మోసపోయమని, 1969లో తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన కాల్పుల్లో 369 మంది మరణించడానికి ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ కారణమని, తెలంగాణకు చెందిన ఉమ్మడి రాష్ట్ర సీఎం టీ అంజయ్యను రాజీవ్‌గాంధీ అవమానించి ఆ పదవి నుంచి తప్పించారని మండిపడ్డారు. 2009లో సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ఇస్తామని ప్రకటించి యూటర్న్ తీసుకోవటం వల్ల వందలాది మంది ఆత్మహత్యకు రాహుల్ తల్లి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన సమస్యలపై, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రాహుల్‌గాంధీ ఎన్నడూ నోరువిప్పలేదని చెప్పారు. ఎన్నికలప్పుడే సోనియా, రాహుల్, ప్రియాంక వచ్చి వెళ్తుంటారని, రాష్ట్ర అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర శూన్యమని అన్నారు.