హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే అంశాన్ని ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏడాది గడిచినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమని మండిపడ్డారు.
ఈ మేరకు గురువారం ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బీసీలకు ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి, 2024-25 బడ్జెట్లో అరకొర కేటాయింపులు చేసి తొలి ఏడాదే కామారెడ్డి డిక్లరేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఉల్లంఘించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీసీవర్గాల్లో విశ్వాసం లేదని, ఈ వైఖరితో రాష్ట్రంలో బీసీలంతా తీరని అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
‘కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడం. కులగణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపే బీసీలకు రిజర్వేషన్ల పెంపు’ అంశం కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఉన్నదని ఆమె గుర్తుచేశారు. ‘ఇప్పటికీ ఏడాది గడిచింది.. రిజర్వేషన్ల పెంపు అతీగతీ లేదు. అశాస్త్రీయంగా బీసీ గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే మీ ఆలోచనగా కనిపిస్తున్నది’ అని అనుమానం వ్యక్తంచేశారు.
కులగణన పూర్తయి చాలాకాలం అవుతున్నదని, ఇప్పటివరకు ప్రభుత్వం ఆ వివరాలను బహిర్గతం చేయలేదని ఎమ్మెల్సీ కవిత దుయ్యబట్టారు. కులగణన వివరాలను తక్షణమే బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమైనట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘బీసీల అంశాల పట్ల ప్రభుత్వం ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తున్నది? బీసీలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చులకన? ఆరు నెలల్లోపే అమలుచేస్తామన్న హామీ 12 నెలలు గడిచినా ఎందుకు అమలుచేయడం లేదు? హామీని అమలుచేయడానికి ఇంకెంత కాలం పడుతుంది? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి ఏడాది పూర్తయ్యిందని, మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం కూడా ముగిసిందని, ప్రస్తుతం గ్రామాల్లో ప్రజాపాలన కాకుండా ప్రత్యేకాధికారుల పాలన సాగుతున్నదని కవిత గుర్తుచేశారు. ప్రభుత్వానికి త్వరగా రిజర్వేషన్లను పెంచి ఎన్నికలను నిర్వహించాలన్న ఉద్దేశం లేన్నట్టు స్పష్టమవుతున్నదని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణమే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి చర్యలను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. బీసీలకు ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాల్సిందే. కుంటిసాకులు చెప్పి ఇచ్చినమాట కంటే తకువ రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం తెలంగాణ సమాజం కాంగ్రెస్ సర్కార్‌ను సహించబోం. బీసీల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ రేవంత్‌రెడ్డి మెడలు వంచి హామీని అమలు చేయించుకుంటాం.
– కల్వకుంట్ల కవిత