ఖైరతాబాద్, ఏప్రిల్ 14: హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మకమైన 125 అడుగుల భారీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు నివాళులర్పించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ఏనాడూ పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ పోరాటాలతోనే మెట్టుదిగి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం భారీ అంబేద్కర్ విగ్రహానికి అధికారికంగా నివాళులు అర్పించే కార్యక్రమాన్ని చేపట్టిందని, మంత్రి వర్గమంతా కదిలొచ్చినా, ముఖ్యమంత్రి మాత్రం రాలేదని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ బడాగణేశ్ మంటపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బీపీ మండల్ మనమడు సూరజ్ మండల్, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, చంద్రవతి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ నగేశ్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్లు వెంకటేశ్, మన్నె కవితతో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం కల్వకంట్ల కవిత మాట్లాడారు. అంబేద్కర్ అంటే తరతరాల ఉద్యమం గుర్తుకు వస్తుందని తెలిపారు. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా జాతి వివక్ష, అణచివేతను తొలగించేందుకు ఉక్కు సంకల్పంతో అంబేద్కర్ ముందుకు సాగారని తెలిపారు. అంబేద్కర్ కేవలం దళితులకే కాదని, ఓబీసీలు, మహిళల కోసం, ముఖ్యంగా మానవ హక్కుల కోసం పనిచేసిన గొప్ప మనిషి అని కొనియాడారు. ఆ మహానుభావుడి వల్లే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పారు.
ఆ మహనీయుడి స్ఫూర్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగర నడి వీధుల్లో ప్రతిష్ఠించుకున్నామని, ఆ ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వం లైట్లు ఏర్పాటు చేసిందని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఖైరతాబాద్ డివిజన్ అధ్యక్షుడు గజ్జెల ఆనంద్, భారత జాగృతి నగర కోకన్వీనర్ తేజా చౌదరి, మాజీ కార్పొరేటర్లు మహేశ్ యాదవ్, లక్ష్మీనారాయణమ్మ, గణేశ్, రమేశ్, సత్యవతి, రేణుక, మేఘన, సోని, పూజ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం జై భీమ్ నినాదాలు మిన్నంటాయి. అంబేద్కర్‌కు నివాళులు అర్పించేందుకు ఎమ్మెల్సీ కవిత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు విష్ణువర్ధన్‌రెడ్డి, చంద్రావతి, రాష్ట్ర కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు నగేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజీవ్సాగర్తోపాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారిని విగ్రహం వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. పోలీసులను తోసుకుంటూ విగ్రహం వద్ద ఉన్న హాలులోకి వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు జై భీమ్ అంటూ పెద్దపెట్టున నినదించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. మాజీ సీఎం కేసీఆర్‌పై ఉన్న అక్కసుతోనే 125 అడుగుల భారీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అంబేద్కర్‌కు నివాళులు అర్పించకపోవడమంటే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టేనని పేర్కొన్నారు.
దేశంలో తొలినాళ్ల నుంచి ఇప్పటివరకు భారత రాజ్యంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానిస్తూ వస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ఆరోపించారు. అంబేద్కర్ ప్రసాదించిన భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఆయన విధానాలను అమలు చేస్తున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ అభయాస్తం కింద దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఒత్తిడికి దిగొచ్చే కాంగ్రెస్ సర్కారు మహా అంబేద్కర్ విగ్రహం గేట్లు తెరిచిందని తెలిపారు.