జగిత్యాల, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి వెంటనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు తగ్గేదే లేదని, తమ ఉద్యమం ఆగదని స్పష్టంచేశారు. పోరాటాల ఖిల్లా జగిత్యాల నుంచే బీసీల మహోద్యమం ఆరంభమవుతుందని, మరో తెలంగాణ ఉద్యమం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంకావాలని పిలుపునిచ్చారు. కులగణన లెక్కలపై బీసీ సామాజిక వర్గంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
సోమవారం ఆమె జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధపు మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బురిడీ కొట్టించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీ గణన విషయంలో పక్కా మోసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో బీసీ జనాభా 52% ఉన్నట్టు 2014లోనే కేసీఆర్ లెక తేల్చారని, బీసీ గణన చేయడం కూడా రాని రేవంత్‌రెడ్డి సరారు తప్పుడు లెకలు చెప్తున్నదని మండిపడ్డారు. కావాలనే బీసీ జనాభాను తకువ చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెకలను రాహుల్‌గాంధీ పార్లమెంటులో ప్రస్తావిస్తూ సభను తప్పదోవపట్టిస్తున్నారని విమర్శించారు. బీసీ ఓటర్లు 46% మాత్రమే ఉన్నారని చెప్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, బీసీ వర్గాల్లో ఏ కులంలో ఎంత జనాభా ఉన్నారనే లెకలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పాలనలో ఎండిపోయిన పొలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తంచేశారు. బీర్పూర్ మండలం మంగెళ గ్రామానికి చెందిన రైతు ఎండిన పొలాలను చూపుతూ, సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని చెప్పారు. కేసీఆర్‌పై అకసుతోనే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం లింక్-1 ద్వారా ఎత్తిపోతలు నిలిపివేయడంతో వరద కాలువలో నీళ్లు లేని దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. జగిత్యాల, చొప్పదండి, పెద్దపల్లి ప్రాంతాల రైతులు అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కక్షలు, కార్పణ్యాలు పక్కనపెట్టి, రైతుల సంక్షేమం కోసం లింక్-1ను వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే.. రేవంత్‌రెడ్డి పాలన చైనా ఫోన్లా ఉన్నది. ఐఫోన్‌కు, చైనా ఫోన్‌కు ఎంత తేడా ఉంటుందో.. కేసీఆర్ పనితీరుకు, రేవంత్‌రెడ్డి పనితీరుకు అంత తేడా ఉన్నది. చైనా ఫోన్ చూడటానికి బాగున్నా సరిగ్గా పనిచేయదు. సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చడం లేదు.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగిత్యాలకు వచ్చిన ఆమె సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జగిత్యాలలోనే మకాం వేశారు. జగిత్యాల నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాలు, పట్టణాలకు చెందిన కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ‘ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌పై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వచ్చే రోజులన్నీ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటాయి. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ 3.0 ప్రభుత్వం వస్తుంది’ అని పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేశారని, ఉప ఎన్నిక ఏ సమయంలో వచ్చినా, జగిత్యాలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని చెప్పారు. సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తుల రాజేందర్రావు, ఓరుగంటి రమణారావు, గట్టు సతీశ్, దావ సురేశ్, శీలం ప్రియాంక ప్రవీణ్ పాల్గొన్నారు.
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఏడాదిలో 31 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్‌రెడ్డి.. బీసీ సంఘాల ప్రతినిధులు, నాయకులతో ఎందుకు సమావేశమవ్వడం లేదు. బీసీ ఉద్యమ నేతలతో సీఎం మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత