మల్యాల/కొడిమ్యాల, మే 10: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉన్నారని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఆలయ విస్తరణతోపాటు పునర్నిర్మాణం వేగవంతం అవుతుందని, ఇందులో అందరం భాగస్వాములవుదామని పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ అంజన్న సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణ (108 సార్లు) కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కొండపైకి చేరుకొని భేతాళస్వామి ఆలయంలో పూజలు చేశారు. తర్వాత ప్రధాన ఆలయంలో పూజలు చేసి స్వామివారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఆలయ ప్రాకార మండపంలో నిర్వహించిన అంజన్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కోరిన కోర్కెలు తీర్చేవాడిగా కొండగట్టు అంజన్నను భక్తులు విశ్వసిస్తారని తెలిపారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండేందుకు చాలీసా పారాయణానికి మించిన ఔషధం లేదని ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్ సూచన మేరకు అంజన్న సేవాసమితిని ఏర్పాటు చేసి మూడేండ్లుగా అఖండ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆంజనేయస్వామికి ఉన్న అపారమైన శక్తుల వల్ల లక్షలాది మంది భక్తులు హనుమాన్ దీక్షలను స్వీకరించి పాదయాత్రగా సుదూర ప్రాంతాల నుంచి చిన్న, పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు తరలివస్తున్నారని తెలిపారు. ఇంతటి మహిమాన్వితమైన కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధి గురించి సీఎం కేసీఆర్‌కు జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్‌కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి తాను విన్నవించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే కొండగట్టు ఆలయ పునర్నిర్మాణం చేపట్టేందుకు రూ.100 కోట్లు మంజూరు చేశారన్నారు. అవసరమైతే మరిన్ని నిధులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో చొప్పదండి, జగిత్యాల ఎమ్మెల్యే దంపతులు సుంకె రవిశంకర్-దీవెన, ఎం సంజయ్‌కుమార్-రాధిక, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు.