చేర్యాల, మార్చి 22 : తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ డిమాండ్‌కు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు బీసీ బిల్లులను పెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందినందున ప్రభుత్వం తదుపరి అడుగు వేయాలని డిమాండ్ చేశారు. చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకుని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టులో సవాలు చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలని సూచించారు. బహుజనుల హక్కుల కోసం తెలంగాణ నుంచే ఉద్యమ పొలికేక మొదలైందని అన్నారు.
బహుజనుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని శనివారం ఆమె దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒగ్గు పూజారులతో పట్నం వేయించి మొక్కులు చెల్లించుకున్నారు. బీసీ బిల్లులు ఆమోదం పొందినందున ఎమ్మెల్సీ కవిత మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మల్లన్న క్షేత్రం ఆవరణలోని గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. 50 శాతానికిపైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణతోసహా 10 రాష్ర్టాలు ఉన్నాయని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలైన తర్వాత తెలంగాణలో 54 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నట్టు చెప్పారు.
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలిగిపోయిన నేపథ్యంలో కోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వాదించాలని సూచించారు. రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాలకు కలిపి ఒకే బిల్లుపెడితే బీసీలకు అన్యాయం జరుగుతుందని తొలి నుంచి తాము వాదిస్తున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కొమురవెల్లి మల్లన్నకు ప్రభుత్వం తరపున తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 130 ఎకరాల భూమిని కేటాయించినట్టు కవిత తెలిపారు. కేసీఆర్ హయాంలో మల్లన్న క్షేత్రం అభివృద్ధి చెందిందని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మల్లన్న ఆలయ మాజీ చైర్మన్ సంపత్, యూపీఎఫ్ కోకన్వీనర్ బొల్ల శివశంకర్, యూపీఎఫ, జాగృతి నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.