జగిత్యాల/పెద్దపల్లి/జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణ ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్నది కేవలం అధికార బంధం మాత్రమే. బీఆర్ఎస్కు ప్రజలతో ఉన్నది పేగుబంధం’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు మద్దతుగా ఆమె ఆదివారం రోడ్‌షో నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో, రాత్రి పెద్దపల్లి జిల్లా మంథని నియోజక వర్గంలోని రామగిరి మండలం సెంటినరీ కాలనీ వాణీ విద్యానికేతన్ క్రీడా మైదానంలో ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు 55 ఏండ్లు అవకాశమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. వృద్ధాప్య పెన్షన్ రూ.200 ఇచ్చారని, రైతులకు పెట్టుబడి సాయం కింద ఏనాడు పైసా ఇచ్చిన పాపాన పోలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీది ప్రజలకు పెట్టే గుణం కాదని, వారిది అధికార కాంక్ష మాత్రమేనని వ్యాఖ్యానించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నిరకాలుగా అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్నన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్, బీజేపీ పాలిస్తున్న రాష్ర్టాల్లో ఎక్కడా లేవన్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో పాఠశాలలే సరిగా లేవని, ఇప్పుడు అనేక గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు కరెంటు కోతలతో చాలా ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు 24గంటల నాణ్యమైన కరెంటును అందిస్తున్నామని చెప్పారు. ‘మీ ఇంట్లో స్విచ్ వేయగానే బుగ్గ వెలిగితే.. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మంథని నియోజక వర్గంలో గత ఐదేండ్ల్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు.
‘నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలపై శ్రీధర్‌బాబును కలిసేందుకు వెళ్తే సర్కారు మాది కాదు నేను ఏ పని చేయలేను అ చెప్పే వాడు. అలాంటప్పుడు అతడికి ఓటు ఎందుకు వేయాలి’ అని ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, జడ్పీ చైర్పర్సన్లు దావ వసంత, జక్కు శ్రీహర్షిణి రాకేశ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.