హైదరాబాద్: విద్యాలయాల్లో వసతులు కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. కష్టాల కడలిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయలు కొట్టుమిట్టాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు దుప్పట్లు లేక చలికి వణికిపోతూ నేలపైనే నిద్రిస్తున్నారని, చన్నీటితో స్నానం చేస్తున్నారన్నారు. ఇది ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్ధతకు నిదర్శనమని మండిపడ్డారు. కేవలం జగిత్యాల జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఆడబిడ్డలు చదువుతున్న పాఠశాల్లో అన్ని వసతులు కల్పించాలని, తగిన విధంగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఉదయం సారంగాపూర్ కస్తూర్బా విద్యాలయంలో తొమ్మిది మంది విద్యార్థినులు అస్వస్థత చెందగా, అందులో ముగ్గురిని స్థానిక దవాఖానకు, మరో ఆరుగురిని జగిత్యాల ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో సాయంత్రం ఇండ్లకు పంపించిన విషయం తెలిసిందే. మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 15 మంది విద్యార్థినులు దవాఖానలో చేరారు.
కష్టాల కడలిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు
జగిత్యాల జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు దుప్పట్లు లేక చలికి వణికిపోతూ నేలపైనే నిద్రించడం…. చన్నీటి స్నానం చేయడం…. ప్రభుత్వ చేతగానితనానికి, అసమర్ధతకు నిదర్శనం.
కేవలం జగిత్యాల జిల్లాలోనే కాదు… pic.twitter.com/6V5hLgjhKZ
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 12, 2024