ఖలీల్‌వాడీ, నవంబర్ 28: బాండ్‌పేపర్ల పేరిట కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. 137 ఏండ్ల చరిత్ర కలిగిన పార్టీ ఈ స్థాయికి దిగజారిందని ఎద్దేవా చేశారు. జీవన్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క వంటి పెద్దపెద్ద నాయకులు కూడా బాండ్ పేపర్ రాసివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు విశ్వాసం కోల్పోయిందో చెప్పడానికి ఇదే ఉదాహరణ అని అన్నారు.
బోధన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి మంగళవారం నిజామాబాద్ క్యాంప్ కార్యాలయంలో కవిత విలేకరులతో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే డ్రామా చేసిందని, 223 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారని, కానీ ఏవీ అమలు చేయలేకపోయారని తెలిపారు. కర్ణాటకలో 2.60 లక్షల ఉద్యోగాలను 100 రోజుల్లో భర్తీ చేస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు.
మాకంటే జాబ్‌లు ఎక్కువ ఇచ్చినట్టు చూపితే ఓట్లు అడగం..
నిరుద్యోగంలో హర్యానా మొదటి స్థానంలో, రాజస్థాన్ రెండో స్థానంలో ఉన్నదని కవిత తెలిపారు. తెలంగాణలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని, 1.60లక్షల ఖాళీలు భర్తీ చేశామని చెప్పారు. ‘ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తే మేం ఒక్క ఓటు కూడా అడగం’ అని కవిత సవాల్ విసిరారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇలాంటి వారు తెలంగాణలో యువతతో మీటింగ్ పెట్టడం ఆశ్చర్యంగా ఉందని వాపోయారు. మొసలి కన్నీళ్లకు బలైతే వచ్చే ఐదేండ్లు కన్నీళ్లు తప్ప ఏమి మిగలవని యువతను హెచ్చరించారు.
రోడ్‌షోకు విశేష స్పందన
జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్‌కుమార్‌కు మద్దతుగా ఎమ్మెల్సీ కవిత మంగళవారం జగిత్యాల పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. జగిత్యాలలో తొలిసారి గులాబీ జెండా ఎగురవేసింది డాక్టర్ సంజయ్‌కుమార్ అని, గతంలో వచ్చిన 60వేల మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో రెండో సారి గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డి నిజంగా ప్రజల కోసం పనిచేసి ఉంటే బాండ్ పేపర్ రాసిచ్చే పరిస్థితి వచ్చేదా?’ అని ప్రశ్నించారు.