హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైరయ్యారు. రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో సీఎం కేసీఆర్ ముందుకొచ్చారని చెప్పారు. దేశంలో మొత్తం వరిలో 40 శాతానికిపైగా తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నది తెలిపారు. రాష్ట్రంలో 61 లక్షల మందికిపైగా రైతులు వరిని పండిస్తున్నారన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని వెల్లడించారు. రైతులకు కేంద్రం అండగా ఉండాలని కోరే హక్కు ప్రతి రాష్ట్రానికి ఉంటుందన్నారు. ధాన్యం కొనకుండా కేంద్రం మన రైతుల పట్ల వ్యవహరించిన తీరు క్రూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతులు, ఇతర వర్గాలవారిపై కేంద్రం దృక్పథాన్ని తెలియజేస్తుందని విమర్శించారు.
వరి ఉత్పత్తిలో ఛత్తీస్‌గఢ్‌తో తెలంగాణను పోల్చడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నించాయని కవిత అన్నారు. 3.5 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి చేస్తున్న ఛత్తీస్‌గఢ్ ఎక్కడ, 80 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ ఎక్కడ అని ప్రశ్నించారు. ఇది యాపిల్, నారింజలను పోల్చడం లాంటిదని, అది వారి అజ్ఞానాన్ని బయటపెడుతున్నదని ఎద్దేవా చేశారు.