హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తేతెలంగాణ): విభజన చట్టానికి అనుగుణంగా కేంద్రం రాష్ర్టానికి బయ్యారం ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి నిధులు కేటాయించడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. బుధవారం ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్రం ఈ ఏడాది రాష్ర్టానికి ఎన్ని నిధులు కేటాయించిందని ప్రశ్నించారు..
సీతారామ ఎప్పటిలోగా పూర్తిచేస్తారు?: తాతా మధు
సీతారామ ఎత్తిపోతల పథకం పనులు నత్తనడకన నడుస్తున్నాయని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులు ఏ దశలో ఉన్నాయి, మిగిలిన పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు.
గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి: పోచంపల్లి
రాష్ట్రవ్యాప్తంగా జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, మినిమం స్కేల్ చెల్లించాలి. రాష్ట్రంలోని 428 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 1,654 మంది 18 ఏండ్లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో టైంస్కేల్ ప్రకటించి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఆర్టిజన్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలి: జీవన్‌రెడ్డి
విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలి. గతంలో ప్రభుత్వంలో విలీనం చేశామన్నారు. కానీ అవుట్సోర్సింగ్ ద్వారా వారికి వేతనాలు ఇస్తున్నారు. వేతనం పూర్తిగా ప్రభుత్వం చెల్లిస్తున్నప్పటికీ వాటిలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కోత విధిస్తున్నాయి. కార్మికశాఖలో విలీనం చేస్తే 20వేల మందికి లబ్ధి చేకూరుతుంది.
ఉద్యమకారులకు న్యాయం చేయాలి: ఎల్ రమణ
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ఉద్యమ సమయంలో కేసులు నమోదైనవారికి ఆర్థిక సాయం అందించాలి. విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేయాలి.
బీఆర్ఎస్ హయాంలోనే పర్యాటకాభివృద్ధి: దేశపతి
కేసీఆర్ హయాంలోనే తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి పునాది పడిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్ తదితరులు తెలిపారు. కేసీఆర్ హయాంలోనే సమ్మక్క సారలమ్మ, రామప్ప ఆలయం, బతుకమ్మ పండగ వంటి సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షింపబడ్డాయని చెప్పారు. గతంలో పర్యాటక రంగం కుంటుపడిందంటూ తప్పుడు లెక్కలు చెప్పిన కాంగ్రెస్ సర్కారుపై మండిపడ్డారు.
శాంతిభద్రతలతోనే పర్యాటక అభివృద్ధి: శేరి సుభాష్‌రెడ్డి
రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుంటేనే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. టూరిజం అభివృద్ధికి సహకరిస్తామని, కానీ ప్రభుత్వ నిర్ణయాల్లో కొన్ని దురుద్దేశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. పర్యాటక స్థలాలను ప్రైవేటీకరిస్తే ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
మాట్లాడితే సస్పెండ్ చేస్తా.. ; కౌశిక్‌రెడ్డికి స్పీకర్ వార్నింగ్
మాట్లాడితే సస్పెండ్ చేస్తా అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆటోడ్రైవర్ల సమస్యలపై చర్చించాలని బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు లేచి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అదేవిధంగా ప్రశ్నోత్తరాల సందర్భంగానూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మరోసారి మాట్లాడితే సస్పెండ్ చేస్తా అంటూ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి స్పీకర్ వార్నింగ్ ఇచ్చారు.