ఖలీల్‌వాడీ, నవంబర్ 27: రైతుబంధును నిలిపివేయించిన కాంగ్రెస్ రైతుల నోటికాడి బుక్కను లాక్కున్నదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైతుబంధు ఎప్పటినుంచో అమలులో ఉన్న పథకమని, ఇప్పటికి 11 సీజన్లు ఇచ్చాం. ఈ పథకం కింద 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.72 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమచేసిందని చెప్పారు. రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్న రైతుబంధు పథకాన్ని, రుణ మాఫీని నిలిపివేయించడం ద్వారా కాంగ్రెస్ తన రైతు వ్యతిరేకతను చాటుకున్నదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి పదే పదే ఫిర్యాదులు చేస్తూ ఆపేయించారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
పంటలు చేతికొచ్చే సమయంలో మిడతల దండు వచ్చి పడ్డట్టు.. ఐదారు రోజులుగా ప్రధాని, ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు వచ్చి తెలంగాణ మీద పడ్డారని కవిత విమర్శించారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో రాహుల్, ప్రియాంక ఎక్కడున్నారని ప్రశ్నించారు. పార్లమెంట్లో కాంగ్రెస్ నాయకులు ఆంధ్ర హక్కులపై మాట్లాడారు తప్ప తెలంగాణ గురించి మాట్లాడలేదని తెలిపారు.
పార్లమెంట్లో పెదవి విప్పని నాయకులు, అవసరమున్నప్పుడు తెలంగాణకు నయా పైసా ఇవ్వని వాళ్లు మనకు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించాలని కోరారు. రైతుబంధు కావాలా.. లేదా రాబంధు కావాలా? ఇరిగేషన్ కావాలా.. లేదా మైగ్రేషన్ కావాలా? అన్నది తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. సీఎం కేసీఆర్‌పై అభాండాలు వేస్తూ పిచ్చిపిచ్చి ఆరోపణలు చేస్తూ దండయాత్రకు వచ్చిన మిడతల దండు పని పట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.