బంజారా హిల్స్ : 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (Kavitha) విమర్శించారు. అయినా పెన్షన్లు, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వలేక పోతున్నారని మండిపడ్డారు. అప్పు కావాలని ఆర్ఏసీ (RAC) సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక పోతున్నాడని విమర్శించారు.
కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారని చెప్పారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడకి పోతుందో ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇవ్వాలన్నారు. వాస్తవాలు లేకుండా తాను ఏది మాట్లాడనని చెప్పారు. రూ.2 లక్షల కోట్ల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలన్నారు. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ప్రజా భవన్లో ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచర్ల ప్రాజెక్ట్ కట్టుకోండి అని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్నారు. కలలో కూడ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు ప్రజా భవన్లో కలిసినప్పుడే గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు రేవంత్ రెడ్డి కట్టబెట్టాడని ఆరోపించారు.