హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): జాతీయపార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు మాత్రమే రాష్ర్టానికొక ఎజెండా ఉన్నదని, ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే అక్కడ కొత్త రాగం అందుకుంటదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఒక రాష్ట్రంలో ఇచ్చిన హామీలకు, మరో రాష్ట్రంలో ఇచ్చే హామీలకు పొంతనే ఉండదని అన్నారు. జాతీయ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ ప్రతినిధి స్మితా ప్రకాశ్ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. తన తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే నేటికీ కట్టుబడి ఉన్నారని చెప్పారు. అబద్ధాలను వల్లెవేసే ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఏర్పడిన తెలంగాణను.. రాష్ట్ర పుట్టుకను ఎన్నోసార్లు అవమానించిన వ్యక్తి ప్రధాని మోదీ అని ద్వజమెత్తారు. బీఆర్ఎస్లో తానొక చిన్న కార్యకర్తను మాత్రమేనని, ఒక కూతురిగా తన తండ్రితో వ్యక్తిగత విషయాలు, ప్రజల ఇబ్బందులు మాత్రమే ప్రస్తావిస్తానని తెలిపారు. రాజకీయాల్లో కేసీఆర్‌కు అపార అనుభవం ఉన్నదని, 50 ఏండ్లుగా ఆయన ప్రజల్లోనే ఉంటున్నారని, ఆయనతో పార్టీ, అంతర్గత అంశాలు చర్చించబోనని చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ ఉపాధి హామీ పథకాన్ని తుంగలో తొక్కిందని, పేదల కడుపుకొడుతున్నదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పథకం ద్వారా కనీసం 40 రోజులు పని కూడా కల్పించడం లేదని చెప్పారు. 70 ఏండ్లు దేశాన్ని పాలించిన పార్టీలు తెలంగాణలో ప్రతి ఇంటికీ నీళ్లు ఇవ్వలేదని కవిత అన్నారు. కేవలం 9 ఏండ్లలో ఇంటింటికీ సురక్షిత తాగు నీరు బీఆర్ఎస్ ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని ఏం చేసినా, ఏం మాట్లాడినా తెలంగాణలో ఏ మాత్రం ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. 9 ఏండ్ల క్రితం పసుపు బోర్డు ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రకటిస్తే.. ‘అది మోదీ ఎన్నికల స్టంట్’ అని ప్రజలకు క్లియర్‌గా అర్థమైందని చెప్పారు.
తన సోదరుడు, మంత్రి కేటీఆర్, తాను రేయింబవళ్లు తెలంగాణ కోసం పోరాటం చేశామని కవిత చెప్పారు. కేసీఆర్ బిడ్డలుగా తామంతా ప్రజాక్షేత్రంలో రాష్ట్రసాధన కోసం అనేక పోరాటాలు చేసి, జైళ్లకు వెళ్లామని తెలిపారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటే.. ప్రధానమంత్రి అనుమతి అవసరం లేదని చురకలంటించారు. మన దేశంలో ఒకే ఒక్క వందేభారత్ రైలును ప్రధాని మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారు? అని ప్రశ్నించారు. మన దేశ భవిష్యత్‌ను మార్చేందుకు నాటి ప్రధాని వాజపేయి తీసుకొచ్చిన ‘గోల్డెన్ క్వాడ్రిలేటరల్’ను ఆయన ఎన్నిసార్లు ప్రారంభించి ఉండాలని ప్రశ్నించారు.
ఇండియా కూటమిలో ఉన్న 26 పార్టీలు బీజేపీని ఓడించేందుకు ఏకమయ్యామని చెబుతున్నారే తప్ప.. వారి అంతమ లక్ష్యం ఏంటో వారికే తెలియదని కవిత అన్నారు. ‘సీపీఐ, కాంగ్రెస్‌లు కేరళ, బెంగాల్లో బద్ధశత్రువులు. కానీ ఇండియా కూటమిలో మిత్రులు. ఈ రెండు పార్టీలు స్థానికంగా సీట్లు ఎలా పంచుకుంటాయి? కార్యకర్తలను మోసం చేయడానికే ఈ మాయలు’ అని కవిత ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్, బీజేపీలు బూటకపు హామీలిస్తూ.. ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయి. మా రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకున్నట్లే.. దేశంలోని సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు బీఆర్ఎస్ దగ్గర మంచి ప్రణాళిక ఉంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి మా ప్రణాళికను అమలు చేస్తాం’ అని చెప్పారు. పదేండ్ల క్రితమే మహిళలకు 33.3 శాతం, ఓబీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరామని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నామని తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఫలితాల ప్రభావం తెలంగాణలో ఏ మాత్రం ఉండబోదని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని అక్కడి ప్రజలే ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర ఎన్నికల బరిలో బీఆర్ఎస్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నదని, కాంగ్రెస్ తమకు సమీప దూరంలో కూడా లేదని చెప్పారు. ఇక బీజేపీ గురించి మాట్లాడకపోవడమే మంచిదని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విభజన హామీలపై లోక్‌సభలో కొట్లాడినా, ప్రత్యేక హైకోర్టు కావాలని నినదించినా.. సోనియా, రాహుల్ గాంధీలు నోరువిప్పి మాట్లాడలేదని చెప్పారు. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఒకప్పుడు సోనియమ్మ బలిదేవత, మృత్యుదేవత అన్నారని, ఇప్పుడు ఆమె గురించి గొప్పలు చెప్తుంటే నవ్వొస్తుందని అన్నారు.
తెలంగాణ సర్వమతాల వేదిక అని కవిత చెప్పారు. ‘మేం హిందువులం. మాకు మ తం వేరు, రాజకీయాలు వేరు’ అని అన్నా రు. ఎంఐఎంతో శత్రుత్వం లేదని, అలాగని కూటమి కూడా కాదని, మంచి మిత్రులమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని కవిత చెప్పారు.
ఢిల్లీ మద్యం పాలసీలో తన పేరు ప్రస్తావించడం బేస్‌లెస్‌గా కవిత అభివర్ణించారు. మొదట్లో పది కోట్లు, 20 కోట్లు.. ఆ తర్వాత 100 కోట్లు అన్నారని, అసలు ఆ స్కామ్ ఏంటో.. అందులో తన పేరు ఎందుకొచ్చిందో కూడా తెలియదని అన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కుట్ర అని, దేశంలో తనవంటి ఇంకొందరు రాజకీయ బాధితులకు న్యాయవ్యవస్థలపై అపారమైన నమ్మకం ఉన్నదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని చెప్పారు.