ఎన్నికల ముందర ఓట్ల కోసం దళితబంధును రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచుతామని ఢిల్లీ నుంచి ప్రియాంకను తీసుకొచ్చి చెప్పించారు. కానీ 14 నెలలు దాటినా పెంపు మాట దేవుడెరుగు కేసీఆర్ ఇచ్చిన రూ.10లక్షలు కూడా ఇవ్వకుండా రేవంత్ మోసం చేశారు.
– ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రధాని మోదీ పాత్రేమీలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పుతోనే మార్గం సుగమమైందని పేర్కొన్నారు. ఎస్సీల వర్గీకరణపై కేసీఆర్ హయాంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారని గుర్తుచేశారు. రేవంత్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణపై వేసిన షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ పేరిట ఎస్సీల మధ్య పంచాయితీ పెట్టవద్దని, అందరికీ సమ న్యాయం జరిగేలా చూడాలని కోరారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో గురువారం దళితబంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోగిల మహేశ్‌తో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణ వంకతో జాబ్ క్యాలెండర్‌ను వాయిదా వేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన హామీ మేరకు దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ రచనతో అణగారిన వర్గాల అభ్యున్నతికి బాటలు వేసిన మహనీయుడు అంబేద్కర్‌కు కేసీఆర్ సముచిత ప్రాధాన్యమిచ్చారని కవిత అన్నారు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిమధ్యన ఏర్పాటు చేసి సమున్నతంగా గౌరవించారని పేర్కొన్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి బాబాసాహెబ్ విగ్రహానికి దండవేయకుండా, సందర్శకులను అనుమతించకుండా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబేద్కర్ జయంతిలోగా ఆయన విగ్రహానికి సీఎం, క్యాబినెట్ మంత్రులందరూ దండలు వేయాలని, లేదంటే విగ్రహం చుట్టూ ఉన్న గేట్లను బద్దలుకొట్టి దండలు వేసి గౌరవించుకుంటామని హెచ్చరించారు. పేదరికంలో మగ్గుతున్న దళితులను ధనవంతులను చేసేందుకే కేసీఆర్ దళితబంధు తెచ్చారని కవిత గుర్తుచేశారు.
రేవంత్‌రెడ్డికి పాలన చేతగావడంలేదని కవిత ఎద్దేవా చేశారు. బడ్జెట్లో ఎస్సీల అభ్యున్నతికి రూ. 33 వేల కోట్లు కేటాయించి కేవలం రూ. 9,800 కోట్లే ఖర్చు చేశారని అన్నారు. ‘రేవంత్‌కు దళితుల సంక్షేమంపై మనసులేదు..నిరుపేదలపై మానవత్వంలేదు..అందుకే కేసీఆర్ పెద్ద మనసుతో శ్రీకారం చుట్టిన దళితబంధు పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారు.’ అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ 14 నెలల పాలనలో అడుగడుగునా దగాపడ్డ దళితబిడ్డలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని కవిత భరోసానిచ్చారు. మరోమూడేండ్లలో మన ప్రభుత్వమే వస్తుందని, దళితుల తలరాతలు మారుస్తుందని స్పష్టం చేశారు.
‘కేసీఆర్ ఎన్నికల కోసం దళితబంధు తీసుకురాలేదు.. దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకే ఈ మహత్తర పథకాన్ని ప్రారంభించారు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు. అంతటి చిత్తశుద్ధి, ధైర్యసాహసాలు చూపిన నాయకుడు కేసీఆర్ తప్ప దేశంలో మరేవరూలేరని ప్రశంసించారు. కానీ స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి కాంగ్రెస్ దళితులను మోసం చేస్తూనే ఉన్నదని నిప్పులు చెరిగారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, దళితబంధు సాధన సమితి నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, మడికొండ రమేశ్ పాల్గొన్నారు.