MLC Kavitha | తెలంగాణ సాయుధ పోరాటానికి జవసత్వాలు నింపిన ప్రజాకవి, పీడనపై అగ్నిధారను కురిపించిన కలం యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు (Daasarathi Krishnamacharyulu) శతజయంతి ఉత్సవాల (Centenary celebrations)ను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)కు కవిత లేఖ రాశారు. హైదరాబాద్లోని ప్రముఖ కూడలిలో దాశరథి విగ్రహాన్ని (Daasarathi Statue) ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని కోరారు. దాశరథి జన్మించిన మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు గ్రామంలో స్మృతి వనం ఏర్పాటు చేయడంతో పాటు గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న దాశరథి గ్రంథాలయానికి ప్రభుత్వం నూతన భవనం నిర్మించాలని సూచించారు. దాశరథి సమగ్ర సాహిత్యాన్ని ప్రభుత్వమే ముద్రించి గ్రంథాలయంలో ఉంచడంతో పాటు అందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు.
దాశరథి శతజయంతి ఉత్సవాలను ప్రభుత్వం పక్షాన అధికారికంగా సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని.. కానీ, ఆ దిశగా పెద్దగా కార్యక్రమాలు జరిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. శత జయంతి సందర్భంగా సంవత్సరం పొడవునా కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శతజయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను ప్రభుత్వం పాఠశాలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పెద్ద ఎత్తున జరపాలని పేర్కొన్నారు. దాశరథిని కారాగారంలో ఉంచిన నిజామాబాద్ జిల్లా పాత జైలును ఇప్పటికే తాను కొంత నిధులను వెచ్చించి దాశరథి స్మారక ప్రాంగణం ఏర్పాటుకు పనులు చేపట్టామని, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రభుత్వం నుంచి కూడా పూనుకొని మరిన్ని ఏర్పాట్లు, మరమ్మతులు చేసి ప్రముఖ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని కోరారు.
మహాకవి దాశరథి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని తెలంగాణ తొలి ప్రభుత్వం 2015 నుంచి దాశరథి జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చిందని గుర్తు చేశారు. దాంతో పాటు ‘దాశరథి సాహితీ పురస్కారం’ని ఏర్పాటు చేసి రవీంద్ర భారతి వేదికగా సన్మానించి రూ.1,01,116 నగదును అందిస్తూ రావడం జరిగిందని చెప్పారు. అలాగే మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ఆడిటోరియంకు దాశరథి ఆడిటోరియంగా పేరు పెట్టడంతో పాటు ఆయన కుటుంబానికి అండగా నిలిచేందుకు వారి కుమారుడికి గత తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడం జరిగిందని వివరించారు. ‘తెలంగాణ విముక్తి పోరులో ప్రజల పక్షాన నిలవడమే కాక అనేక రచనా ప్రక్రియలలో సాహితీ సృష్టి చేసిన సృజనకారులు.
ఈ నేల అస్మితను ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయుని శత జయంతి ఉత్సవాలు తెలంగాణ తన మూలాలను నెమరువేసుకునే చారిత్రక సందర్భం. దాశరథి గారి స్ఫూర్తిని ముందుతరాలకు చాటే దిశగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని తమరిని సవినయంగా కోరుతున్నాను’ అని లేఖలో పేర్కొన్నారు. కవిత్వం, నాటికలు, కథలు, యాత్రా చరిత్ర వంటి ప్రక్రియలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహాకవి దాశరథి అని కొనియాడారు. అద్భుతమైన సినిమా పాటల రచయితగా జోతలందుకున్న తెలంగాణ బిడ్డ దాశరథి కృష్ణమాచార్య అని, ఆయన శత జయంతి తెలంగాణ ప్రజలందరికీ పెద్ద పండుగ. ఈ శత జయంతి సంవత్సరాన్ని ఘనంగా నిర్వహించడం ప్రభుత్వం విద్యుక్త ధర్మమని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
Nara Lokesh | తెలంగాణలో టీడీపీని పునర్నిర్మిస్తాం.. ఏపీ మంత్రి నారా లోకేశ్
Congress Govt | క్యాలెండర్ ఏది? జాబులేవి?.. రెండు లక్షల ఉద్యోగాలు బుట్టదాఖలు!