Congress Govt | హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలం గాణ): ఏటా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు.. ఇవీ అశోక్‌నగర్‌లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు. ఏడాది గడిచినా అతీగతీ లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం దగాపై రగిలిపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లు మీ ఖాతాలో వేసుకొని ఎన్నాళ్లు ఏమార్చుతారు? అంటూ మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను నెరవేర్చాలని, లేదంటే కాంగ్రెస్ మోసాలకు జవాబు తప్పదని హెచ్చరిస్తున్నారు. అశోక్‌నగర్, దిల్‌సుక్‌నగర్‌లో జేఏసీలుగా ఏర్పడి సర్కార్‌పై మరో సమరానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా గ్రూపులలో ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తున్నది.
క్రెడిట్ చోర్కి కేరాఫ్
55 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది. వాస్తవానికి ఇది పచ్చిమోసం. కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ చోర్కి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. పక్కవాళ్ల క్రెడిట్ దొబ్బేయడంలో కాంగ్రెస్ నాయకులను మించినోళ్లు లేరని వాదిస్తున్నారు. నిజానికి గ్రూప్ 1, 2, 3 పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే నోటిఫికేషన్లు ఇచ్చింది. మహిళా శిశు సంక్షేమశాఖ, పోలీస్, విద్యుత్తు సంస్థలు, గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి బీఆర్ఎస్ హా యాంలోనే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. రకరకాల కారణాలతో వాటికి కాంగ్రెస్ పాలనలో కొన్ని నియామక ఉత్తర్వులు ఇవ్వగా, మరికొ న్ని పరీక్షలు నిర్వహించారు. గ్రూప్-4 పోస్టులకు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి భర్తీ చేయగా.. రేవంత్‌రెడ్డి వాటికి నియామక పత్రాలను అందించి తామే ఇచ్చినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇంత కన్నా మోసం మరోటి ఉంటుందా? అని నిరుద్యోగ యువత ఉదహరణగా చూపుతున్నది. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను ఏమాత్రం జంకుగొంకు లేకుండా తమ ఖాతాలో వేసేసుకోవడంపై వారు ఆక్షేపిస్తున్నారు.
భగ్గుంటున్న నిరుద్యోగులు
ఉద్యోగాల భర్తీపై సర్కారు నిర్లక్ష్యంపై నిరుద్యోగలు భగ్గుమంటున్నారు. వయోపరిమితి మించిపోతుండటంతో చాలా మంది చివరి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా పెద్ద సంఖ్యలోనే ఉండటం గమనార్హం. తమ బాధలు ప్రభుత్వానికి పట్టవా అంటూ వారు ఏకరువు పెడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరిస్తున్నారు. దీంతో నిరుద్యోగ జేఏసీ నేతలు సరూర్‌నగర్ స్టేడియంలో భారీ బహిరంగసభకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 24న నేతాజీ జయంతి సందర్భంగా రక్తదానం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఉత్తచేతులతో టీజీపీఎస్సీ..
ఇంతవరకు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడంతో టీజీపీఎస్సీ ఉత్త చేతులతో నడుస్తున్నది. భర్తీ చేసే పోస్టులు తమ చేతిలో లేకపోవడంతో పాత నోటిఫికేషన్లను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నది. మే తర్వాతే నోటిఫికేషన్లు జారీచేస్తామని టీజీపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. భర్తీచేసే ఉద్యోగాల వివరాలివ్వాలంటూ సర్కారుకు లేఖ రాస్తామని తెలిపింది. మే దాకా నోటిఫికేషన్లు రావన్నమాట. ఆ ఆరు నెలలు స్థానిక ఎన్నికల కోడ్ ఉండే అవకాశం ఉండటంతో ఉద్యోగ భర్తీపై ప్రభావం పడే అవకాశం ఉన్నది. దీంతో ఈ ఏడాది ఉద్యోగాల భర్తీ ఉండకపోవవచ్చనే ఆందోళనలో నిరుద్యోగ యువకులు ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తాం
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మరికొన్ని మోసాలకు తెరలేపుతున్నది. రెండు లక్షల ఉద్యోగాలు అబద్ధం. నెలకు నాలుగు వేల నిరుద్యోగ భృతి అబద్ధం. ఇది చాలదంటూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గ్రూప్-1, గ్రూప్-2, ఎస్ఐ, కానిస్టేబుల్, డీఎస్సీ అంటూ మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నది. నిరుద్యోగుల సత్తాచూపుతాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి తీరుతాం.
– జనార్దన్, నిరుద్యోగ జేఏసీ నేత