హైదరాబాద్: తెలంగాణ వ్యతిరేక టీడీపీ రాష్ట్రంలో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నది. పార్టీని పునర్నిర్మిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా ఆయన తనయుడు మంత్రి లోకేశ్ (Nara Lokesh) కూడా స్పందించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని మళ్లీ విస్తరిస్తామని, ఈ దిశగా చర్చలు జరుపుతున్నామన్నారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నారా లోకేశ్ నివాళి అర్పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.60 లక్షల మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారని, పార్టీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ, ఆశ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
తెలంగాణలో టీడీపీపై ప్రజలకు ఎంతో ప్రేమ ఉన్నదని, స్వచ్ఛందంగా 1.6 లక్షల మంది సభ్యత్వాలు పొందడమే దానికి ఉదాహరణ అని చెప్పారు. తమకు ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోయినా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా పార్టీ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు.