హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం నిరసన దీక్ష చేపట్టనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి, ఆమోదింపజేయాలనే డిమాండ్‌తో భారత జాగృతి తరఫున ఆమె ఒక్క రోజు దీక్ష తలపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఢిల్లీకి చేరుకున్న కవిత.. గురువారం సభాస్థలిని పరిశీలించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. దీక్ష ఉదయం పదింటికి మొదలై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది.
ఎమ్మెల్సీ కవితతోపాటు దాదాపు 500 మంది దీక్షకు కూర్చునే అవకాశం ఉన్నది. మొత్తంగా అన్ని రాష్ర్టాల నుంచి సుమారు ఆరు వేల మంది వరకు హాజరవుతారన్న అంచనా మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. 18 రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు వస్తున్నట్టు వెల్లడించారు. దీక్షను సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించనున్నారు. ఈ మేరకు కవిత గురువారం ఏచూరిని కలిశారు. దీక్షకు హాజరుకావాల్సిందిగా మరోసారి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దీక్షలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, నామా నాగేశ్వర్రావు, కే కేశవరావు, వెంకటేశ్ నేత, వద్దిరాజు రవిచంద్ర, సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, రేఖానాయక్ తదితరులు ఢిల్లీకి వెళ్లారు.
ఎమ్మెల్సీ కవిత దీక్షను అడ్డుకునేందుకు బీజేపీ చివ రి నిమిషం వరకు ప్రయత్నించింది. జంతర్‌మంతర్‌లో శుక్రవారం సభ నిర్వహించేందుకు భారత జాగృతి గతంలోనే దరఖాస్తు చేసుకోగా, పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. అయితే బుధవా రం మధ్యాహ్నం ఆ స్థలంలో అదే సమయంలో బీజే పీ దీక్ష ఉన్నదంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. దీక్షను వేరే మైదానానికి వాయిదా వేసుకోవాలని ఒకసారి, జంతర్మంతర్లోనే సగం స్థలంలో సర్దుకోవాలని, మిగతా స్థలాన్ని బీజేపీకి ఇవ్వాలని మరోసారి సూచించారు. దీంతో భారత జాగృతి సభ్యులు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపారు. చివరికి ఢిల్లీ పోలీసులు దీక్షకు అనుమతి ఇచ్చారు.