నిజామాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపుబోర్డు ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాగతించారు. క్వింటా పసుపునకు రూ.15 వేల కనీస మద్దతు ధర ప్రకటించాలని, పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రెండూ చేసినప్పుడే పసుపు బోర్డుకు సార్థకత ఏర్పడుతుందని, అప్పుడే పసుపు రైతులకు సంపూర్ణన్యాయం లభిస్తుందని స్పష్టంచేశారు.
తూతూమంత్రంగా పసుపుబోర్డును ఏర్పాటుచేయడం కాదని, అందుకు తగిన సౌకర్యాలు, పరిశోధన సామర్థ్యాన్ని కేంద్రం సమకూర్చాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పసుపుబోర్డు ఏర్పాటును ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయని, పసుపుబోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశారని ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించలేదని, ప్రొటోకాల్ పాటించలేదని, ఇది ప్రభుత్వ నియమ, నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు.
పసుపుబోర్డును ఏర్పాటుచేయాలంటూ 2014లో తాను ఎంపీగా ఎన్నికైన నెల రోజుల్లోనే అప్పటి వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గుర్తుచేశారు. పలువురు ముఖ్యమంత్రులను కలిసి పసుపుబోర్డు ఏర్పాటుకు మద్దతు లేఖలు సేకరించానని, ప్రధాని మోదీని రెండుసార్లు కలిసి విజ్ఞప్తి చేశానని వివరించారు. పార్లమెంట్లో అనేకసార్లు మాట్లాడటమే కాకుండా ప్రైవేట్ మెంబర్ బిల్లును కూడా ప్రవేశపెట్టానని తెలిపారు. బోర్డు ఏర్పాటు మాత్రమే కాకుండా కనీస మద్దతు ధర ప్రకటించాలని, దిగుమతులపై నియంత్రణ విధించాలని కేంద్రానికి అనేకసార్లు వినతులు అందించానని చెప్పారు. ఇలా గతంలో త్రిముఖ వ్యూహంతో అలుపెరగని పోరాటం చేశానని స్పష్టంచేశారు.
పసుపుబోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే పసుపు ఆధారిత పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించడానికి కృషిచేసినట్టు తెలిపారు. ఇతర దేశాల నుంచి నాణ్యత లేని పసుపు దిగుమతి అవుతున్నదని, దాంతో రైతులు నష్టపోతున్నారని, దిగుమతులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. 2014లో ఎనిమిది లక్షల క్వింటాళ్ల పసుపు దిగుమతి అయితే, ఇప్పుడు రెట్టింపయిందని, ఏటేటా దిగుమతులు పెరుగుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గాలిమాటలు మాట్లాడటం మానేసి పసుపునకు మద్దతు ధర సాధించాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. స్పైసెస్‌బోర్డు బెంజ్ కారులాంటిదని, పసుపుబోర్డు అంబాసిడర్ కారు లాంటిదంటూ గతంలో అవహేళన చేసిన అరవింద్‌కు ఇప్పుడు మాట్లాడే నైతికహక్కు లేదని మండిపడ్డారు. ఎంపీ అరవింద్‌కు వెకిలిమాటలు మాట్లాడటం అలవాటని, తాము పసుపుబోర్డు డిమాండ్ చేసే నాటికి అరవింద్ అసలు రాజకీయాల్లో లేరని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రిచాటు బిడ్డగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంపీగా గెలిపిస్తే ఐదురోజుల్లో పసుపుబోర్డు తీసుకొస్తానంటూ బాండ్‌పేపర్ రాసిన అరవింద్.. ఎంపీగా గెలిచిన తర్వాత పసుపుబోర్డు కంటే స్పైసెస్బోర్డే బాగుంటుందని అన్నారని గుర్తుచేశారు. ఒకవేళ బెంజ్‌కారు ఉంటే అంబాసిడర్కారు ఎందుకు ఇచ్చినట్టు? అని ప్రశ్నించారు.
తాము కేంద్రంపై పదేపదే ఒత్తిడి చేయడం వల్లే గతంలో స్పైసెస్‌బోర్డు కార్యాలయం ఏర్పాటైందని, అది కూడా ఆయన గొప్పతనమని చెప్పుకోవడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. స్పైసెస్‌పార్కు ఏర్పాటుకు వేల్పూర్ వద్ద గతంలో కేసీఆర్ 42 ఎకరాలు కేటాయించారని, ఆ పార్కులో పసుపు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేయాలని డిమాండ్ చేశారు. ప్రెస్‌మీట్ అనంతరం ఎమ్మెల్సీ కవితను పసుపు కొమ్ములతో తయారుచేసిన దండతో పలువురు బీఆర్ఎస్ నేతలు ఘనంగా సత్కరించారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నిజామాబాద్ మేయర్ నీతూకిరణ్, బీఆర్ఎస్ నేతలు సుజిత్‌సింగ్ ఠాకూర్, బాజిరెడ్డి జగన్, సిర్ప రాజు, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): విజ్ఞానాన్ని పెంచి ఉజ్వల భవిష్యత్తును అందించే గ్రంథాలయాలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో గ్రంథాలయాల్లో వసతులు కల్పించి విద్యార్థులు, ఉద్యోగార్థులకు బాసటగా నిలిస్తే, రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో కామారెడ్డి జిల్లా బాన్సువాడలో గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాన చేశారని, ఏడాది దాటినా నిర్మాణ పనులు మొదలుపెట్టలేదని ఆరోపించారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన గ్రంథాలయంలో స్థలం సరిపోక ఉద్యోగార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం వెంటనే నూతన భవన పనులు ప్రారంభించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని గ్రంథాలయాలకు వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.