MLC Kavitha | నిజామాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మా ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆర్.. మరి మీ అభ్యర్థి ఎవరు?’ అంటూ కాంగ్రెస్, బీజేపీలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వందకుపైగా సీట్లు సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2014లో 63 స్థానాలు, 2018లో 88 స్థానాల్లో గెలిచిన తాము.. ఈ సారి 100కుపైగా సీట్లు గెలవడం తథ్యమని చెప్పారు. ఒకేసారి 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు సీఎం అభ్యర్థి ఎవరో, నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరో తెలియని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయని విమర్శించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి మూడోసారి టికెట్ ఖరారైన తర్వాత శుక్రవారం తొలిసారిగా నియోజకవర్గానికి రాగా, 44వ జాతీయ రహదారి నుంచి వెయ్యికిపైగా బైక్‌లు, 500 కార్లతో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారికి బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అభిమానులు బహూకరించిన కత్తి దూసిన ఎమ్మెల్సీ కవిత విజయ సంకేతం చూపించారు.
ఉద్యమంలో పని చేసిన జీవన్‌రెడ్డి కావాల్నా.. వేరే వారు కావాల్నా ఆలోచించాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రాష్ట్రంలో తొలిసారిగా రూ.160 కోట్లతో మంచినీటి పథకం ఆర్మూర్‌కే దక్కిందని, ఆ తర్వాతే రాష్ట్రమంతటా అమలైందని గుర్తుచేశారు. 2014లో జీవన్‌రెడ్డికి 15 వేల మెజార్టీ వచ్చిందని, రెండోసారి 30 వేల ఓట్లతో గెలిచాడని, మూడోసారి 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు. మెజార్టీ పక్కానా.. అంటూ కార్యకర్తలను కవిత అడుగగా వారు చప్పట్లు కొట్టి పక్కా అని పేర్కొన్నారు. ఏడాదిన్నరగా 24 గంటలపాటు కేసీఆర్నీడగా ఉంటూ జీవన్‌రెడ్డి పనిచేస్తున్నారని కితాబిచ్చారు. జీవన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత ఆశీర్వాదం తోడైందని పేర్కొన్నారు. లలిత తరఫున వచ్చిన ఓట్లన్ని జీవన్‌రెడ్డికి వేసి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని జీవోల జీవన్రెడ్డిగా కవిత అభివర్ణించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించి ప్రజల వద్దకెళ్లి నిజాయతీగా కార్యకర్తలు ఓట్లు అడగాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
ఆర్మూర్ గడ్డ కేసీఆర్ అడ్డా అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చెప్పారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని, తనపై పోటీ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులే కరువయ్యారని తెలిపారు.
కొల్లాపూర్/వైరా టౌన్, ఆగస్టు 25 : బీఆర్ఎస్ టికెట్ ఖరారైన తరువాత తొలిసారి నియోజకవర్గాలకు చేరుకున్న అభ్యర్థులకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు వచ్చిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డికి ఘన స్వాగతం లభించింది. 420 కార్ల భారీ కాన్వాయ్‌తో నియోజకవర్గంలో ఎమ్మెల్యే అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అడుగడుగునా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనపై పూలవర్షం కురిపించారు. పటాకుల మోతలు హోరెత్తించారు. కాగా ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్ శుక్రవారం వైరా పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. బీఆర్ఎస్ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికాయి.