MLC Kavitha | నిజామాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో రాహుల్‌గాంధీకి రైతన్నలకు మధ్యనే ఎన్నికలు జరుగబోతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌ను కోరడం హాస్యాస్పదమని అన్నారు. ‘సీఎం కేసీఆర్ ఇస్తున్న పథకాలను ఆపుకుంటూ వెళ్లాలంటే ముందు కరెంట్ కట్ చేయాలి, ఆ తర్వాత మిషన్ భగీరథ నీళ్లు ఆపాలి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆపాలి. వీటిని ఆపడం సాధ్యమవుతుందా? పది సంవత్సరాల నుంచి నడుస్తున్న పథకాలు కొత్తవని భావిస్తుంటే కాంగ్రెస్ ఎంత అభద్రతాభావంతో ఉన్నదో అర్థమవుతుంది’ అని మండిపడ్డారు. నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కవిత.. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.
ఓట్లు చీలితే ఎవరికి లాభమో ముస్లింలు ఆలోచించాలని కవిత కోరారు. ఓట్లను చీల్చకుండా కేసీఆర్ వైపు నిలిస్తే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందని చెప్పారు. ఏ ప్రభుత్వం వస్తే మత సామరస్యం వెల్లివిరుస్తుందో అందరికీ తెలుసున్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ కామారెడ్డి నుంచి పారిపోయి నిజామాబాద్ వస్తున్నారని, ఆయన ముఖం చూసి కాకుండా పార్టీలను చూసి ఓటెయ్యాలని విజ్ఞప్తిచేశారు. ఈ మధ్య రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్‌లు ఎక్కువయ్యారని, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలోకి మారుతున్నారో తెలియని పరిస్థితి ఉన్నదని అన్నారు. పాలోడా పగోడా అంటూ కొంతమంది మాట మార్చుకున్న సందర్భాలు చూస్తున్నామని పరోక్షంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
నిజాలు చెప్తూ ప్రచారం చేయడం బీఆర్ఎస్ లక్షణమని, కాంగ్రెస్ లాగా అబద్ధాలు చెప్పడం, బీజేపీ లాగా పథకాలను కాపీ కొట్టడం, పేర్లు మార్చి తమ పథకాలే అని చెప్పుకోవడం తమకు రాదని కవిత చెప్పారు. తప్పకుండా మరోసారి అధికారంలోకి వస్తామన్న సంపూర్ణ విశ్వాసం ఉన్నదని, వందకు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ పార్టీ మ్యానిఫెస్టో ఎంత అద్భుతంగా ఉందో ఎన్నికల ఫలితాలు నిరూపిస్తాయని చెప్పారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం తొమ్మిది సీట్లను గెలుస్తామని అన్నారు. కోరుట్లలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ అర్వింద్‌ను తప్పకుండా ఓడిస్తామని పునరుద్ఘాటించారు. తెలంగాణకు బీజేపీ అడుగడుగునా అన్యాయం చేసిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకిస్తున్నట్లు పార్లమెంట్లో ప్రధాని మోదీ మాట్లాడారని, బీజేపీ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని అంత అవసరం కూడా తమకు లేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నాయకుడు మల్లికార్జున ఖర్గేను పక్కనపెట్టి అన్ని గ్యారెంటీలను రాహుల్‌గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకగాంధీలు ప్రకటిస్తున్నారని కవిత విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు. మండల్ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు దాన్ని అమలు చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయలేదని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి బీసీ నాయకులు మూకుమ్మడిగా రాజీనామా చేశారని తెలిపారు. బీసీలకు బీఆర్ఎస్ చేసినంత ఎవరూ చేయలేదని, అందుకే ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, బీసీల ప్రభుత్వమని చెప్పుకుంటామని వివరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో జాబ్ క్యాలెండర్ ఎక్కడ ప్రకటించారో ఆ పార్టీ నాయకులు చెప్పాలని సవాల్ విసిరారు.
కామారెడ్డిలో కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంపై కవిత స్పందించారు. సీఎం కేసీఆర్‌ను రాష్ట్రమంతా తిరగనీయకుండా కేవలం పోటీచేస్తున్న నియోజకవర్గానికే పరిమితం చేయాలని భావించి రేవంత్‌రెడ్డి పోటీ చేస్తారంటే అది అమాయకత్వమే అవుతుందని అన్నారు. నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు పని చేయడానికి వేలాది మంది కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. తాము నిరంతరం ప్రజల్లోనే ఉంటామని, ప్రత్యర్థి పార్టీ నుంచి ఎవరు పోటీచేసినా గెలుపు మాత్రం సీఎం కేసీఆర్‌దేనని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ రైతుల గురించి ఆలోచించలేదని కవిత విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుని ఆదుకున్నదని, రైతన్నకు అండగా నిలిచింది సీఎం కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ను నాలుగు నెలల క్రితమే నిలిపి వేశామని గుర్తుచేశారు. రైతులు ఎటువంటి అపోహలకు లోను కావాల్సిన అవసరం లేదని కోరారు.