ఖైరతాబాద్, మార్చి 15 : బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటాను అమలు చేయాలని, లేదంటే బీసీలంతా ఏకమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాయని బీసీ నేతలు స్పష్టంచేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం లక్డీకాపూల్‌లోని హెటల్ సెంట్రల్ కోర్టులో బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో మాట మార్చి బీసీలను మోసగించిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారని, కానీ కేవలం రూ.3వేల కోట్లకే సరిపెట్టిందని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు మొదటి నుంచి అన్యాయమే జరుగుతున్నదని శాసనమండలి సభాపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలో కాంగ్రెస్.. బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. బీసీలు అడుక్కొవడం మాని సంఘటితంగా పోరాడి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి బీసీలపై ఉన్న వ్యతిరేకత తన పాలనలోనే స్పష్టమైందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే పరిషత్ ఎన్నికల్లో మరోసారి మోసగిస్తూ ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని, పోరాడి రిజర్వేషన్ల హక్కులను సాధించుకుంటామని తేల్చిచెప్పారు. అనంతరం బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, కాంట్రాక్టు రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీ అత్యాచార నిరోధక చట్టాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాలను ఆమోదించారు. సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, శ్రీనివాస్‌యాదవ్, రామకృష్ణ, నందగోపాల్, వంశీ, ఉషా, సమ్మయ్య పాల్గొన్నారు.