హైదరాబాద్, మార్చి 15 (నమస్తేతెలంగాణ) : డెస్క్ జర్నలిస్టుల హక్కుల కోసం డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) పోరాడుతుందని రాష్ట్ర అధ్యక్షుడు బాదిని ఉపేందర్ స్పష్టంచేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో డీజేఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రింట్, ఎలాక్ట్రానిక్, వెబ్ మీడియాల్లో పనిచేస్తున్న డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. డీజేఎస్ విజ్ఞప్తి మేరకు జిల్లా అక్రెడిటేషన్ కమిటీల్లో డెస్క్ జర్నలిస్టులకు చోటు కల్పిస్తామని, మహిళలకు 33 శాతం కోటా కేటాయిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తే ఉధృతపోరాటానికి సిద్ధంకావాలని డెస్క్ జర్నలిస్టులకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో డీజేఎస్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా కే ఎన్ రాజారాం, ఉపాధ్యక్షుడిగా సోమ నర్సయ్య (వరంగల్), కోశాధికారిగా వెంకటరమణ, సంయుక్త కార్యదర్శులుగా కనపర్తి రమేశ్ (కరీంనగర్), కాంకూరి వెంకటేశ్వర్ (ఖమ్మం), భీంరావు (నిజామాబాద్), కార్యవర్గ సభ్యులుగా గరీమ, పద్మ, సత్యప్రసాద్ ఎన్నికయ్యారు. సమావేశంలో డెస్క్ జర్నలిస్టులు అశోక్, సదానందం, నరేందర్, లింబాద్రి, రమేశ్‌కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.