హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరసరిస్తారని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని, ఆ పార్టీ మాటలు నమ్మశక్యం కాదని అన్నారు. గత పదేండ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ అంటే ఎందుకు కక్షనో అర్థం కావడం లేదని అన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలతో ఆత్మబంధంలేదని విమర్శించారు. గురువారం ఆమె పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై కుండబద్దలు కొట్టారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కేంద్రం తలుచుకుంటే అమలు చేయవచ్చని కానీ చేయబోదని మహిళలకు అర్థమైందని చెప్పారు. మహిళా బిల్లు సాధనకు ఉద్యమించినట్టుగానే త్వరలో ఆ చట్టం అమలు కోసం కూడా ఉద్యమిస్తామని ప్రకటించారు. ఓబీసీ మహిళలకు కూడా రిజర్వేషన్లలో కోటా కోసం తమ పోరాటం సాగుతుందని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తున్నామని, ప్రజలు తమను ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీకి రాజకీయాలు చేయడమే తప్ప తెలంగాణ ప్రజలతో ఆత్మసంబంధాన్ని నెరపలేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి తెలంగాణ ప్రజలను బీజేపీ మోసం చేసింది. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు తెలంగాణను ఏర్పాటు చేయలేదు’ అని ఉదహరించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రలో కలిపితే ఒక బీజేపీ, కాంగ్రెస్ నాయకుడు కూడా మాట్లాడలేదని విమర్శించారు. ‘తెలంగాణ ఏర్పడిన కొత్తలో ‘తల్లిని చంపి బిడ్డను బతికించారు’ అని మోదీ అన్నారు. ‘మోదీకి తెలంగాణ మీద ఏం కక్షనో? గానీ గత పదేండ్ల కాలంలో రాష్ర్టానికి ఆయన చేసింది ఏమీ లేదు’ అని చెప్పారు. ప్రధాని పదేపదే తెలంగాణను అవమానపరిచే విధంగా, అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు తప్ప తెలంగాణకు బీజేపీ చేసింది ఏమిటని ఆమె ప్రశ్నించారు.
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు సీట్లు తగ్గుతాయన్న ప్రచారంపై కవిత మాట్లాడుతూ.. దేశంలో జనాభా అసమానంగా పెరిగిందని, కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగగా దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిందని చెప్పారు. 1971 జనాభా లెకల ఆధారంగా గత ప్రభుత్వాలు నియోజకవర్గాలను పునర్విభజన చేశాయని అన్నారు. నియోజకవర్గాలు తగ్గడం తెలంగాణకే కాకుండా దక్షిణాదికి మంచిది కాదని, తప్పకుండా దీనిపై మాట్లాడుతామని అన్నారు.
ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ తిరసరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కవిత పేర్కొన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తే మండలిలో వారి సమస్యలను లేవనెత్తుతారనే సదుద్దేశంతో ఆ ఇద్దరిని నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారని, దానికి అడ్డుపడడం సంప్రదాయం కాదని అన్నారు. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన సంప్రదాయాలను పాటించాలని ఆమె సూచించారు. ‘మళ్లీ అవే పేర్లను పంపిస్తాము అప్పుడు ఆమోదించాల్సిందే’ అని అన్నారు.
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ అంత పెద్ద మాట అంటే ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా స్పందించలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ నాయకులకు కనీసం ఆత్మగౌరవం లేదా? వాళ్లు తెలంగాణ బిడ్డలు కాదా? తెలంగాణను ఎవరేమన్నా వాళ్లకు పట్టింపు లేదా’ అని నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్న సోనియాగాంధీ కల కోసమే వాళ్లు పనిచేస్తారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడేది బీఆర్ఎస్ పార్టీ అయితే ఓట్లేమో కాంగ్రెస్ పార్టీకి వేయాలా? అని ప్రశ్నించారు. అర్రాస్ పాట పాడినట్లు కేసీఆర్ ఇంతిస్తున్నారు కాబట్టి అంతకంటే ఎకువ ఇస్తామని అంటున్నారని మండిపడ్డారు. అన్నీ కేసీఆరే ఇస్తుంటే ఇక కాంగ్రెస్ వాళ్లు ఎందుకు అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఏ మాట చెప్పినా నమ్మశక్యంగా ఉండదన్నారు. ఇది కర్ణాటక, రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో రుజువయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.