హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ): ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా నిధులు ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత రా ష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పథకానికి నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్రెడ్డి అన్నదాతలను మరింత ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని తన నివాసంలో గురువారం బీఆర్ఎస్ బోధన్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్ర భుత్వం నిర్ణయించాలని అనుకోవడం దారుణమని పేర్కొన్నారు.
రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా లేదా ప్రభుత్వ కా ర్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్ప లు పెడుతారా? అని కవిత ప్రశ్నించారు. కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటే, కాంగ్రెస్ పాలకులు రైతాంగాన్ని అవస్థలపాలు చేస్తున్నారని చెప్పారు. షరతులు, నిబంధనల పేరిట లక్షలాది మంది రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎగవేసే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్య తిరేకతను మూటగట్టుకున్నదని తెలిపారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీల అమలు కోసం అందరం గళమెత్తుదామని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. మహిళలకు నెలకు రూ. 2,500, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు సూటీలు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ధ్వజమెత్తారు. రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పడు రైతు భరోసాకు షరతులు విధించి దగా చేసేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాం గ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో కేసీఆర్ అమలుచేసిన పథకాలు, కార్యక్రమాల వల్ల కలిగిన ప్రయోజనాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వివరించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకు లు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, సమిష్టిగా పనిచేసి ఊరూరా గులాబీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమా, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.