MLC Jeevan Reddy | జగిత్యాల, అక్టోబర్ 22, (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం వల్లే గంగారెడ్డి లాంటి కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని కాం గ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. తన అనుచరుడి హత్యను నిరసి స్తూ చేసిన ధర్నా అనంతరం మంగళవారం జిల్లా దవాఖానలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేండ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందని, కానీ, ఫిరాయింపులు వారిలో తీవ్ర మనోవేదన మిగిలించాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతి పార్టీకి నియమావళి ఉంటుందని, నైతిక విలువలు ఉంటాయని, అధికారం కంటే నైతిక విలువలే ముఖ్యమని స్పష్టంచేశారు. 1984లో రాజీవ్‌గాంధీ ప్రధాని అయ్యాక రాజకీయాల్లో నైతిక విలువల కోసం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమల్లోకి తెచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్నా ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. మూడు మాసాలుగా మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని, 40 ఏండ్లు పార్టీ కోసం పనిచేసిన తనలాంటి వారికి ఇప్పుడు పార్టీలో స్థానం ఎక్కడ ఉన్నదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పదేండ్లు బీఆర్ఎస్లో అధికారం అనుభవించినవారు కాంగ్రెస్‌లో చేరారని, కాంగ్రెస్ ముసుగులో కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను హత్యలు చేయించడం అత్యంత బాధాకరమని వాపోయారు.
మమ్మల్ని బతుకనీయండి.. విప్‌పై జీవన్‌రెడ్డి ఫైర్
ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంగారెడ్డి హత్య ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో జరగ్గా, విషయాన్ని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విప్ లక్ష్మణ్‌కుమార్‌కు ఫోన్లో తెలిపారు. ఆయన 12గంటల ప్రాంతంలో ధర్నా వద్దకు రాగానే కార్యకర్తలు ఘొరావ్ చేశారు. గంగారెడ్డి హత్యకు ఎవరు బాధ్యులు? అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ ముసుగు తొడుక్కునవారే హత్య చేయించాని ఆరోపించారు. తీవ్ర అసహనానికి లోనైన జీవన్‌రెడ్డి ‘కార్యకర్త హత్యకు గురయ్యాడని ఉదయం 7 గంటలకు చెప్తే.. ఇప్పుడా వచ్చేది’ అంటూ నేరుగా విప్ ముందే ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎస్పీ అశోక్‌కుమార్ చేరుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేయగా రెండు చేతులూ జోడించి, ‘సార్.. దయచేసి మీ వల్ల ఏం కాదు.. మీరు వెళ్లిపోండి.. మీవారి వల్లే ఇలా జరిగింది..’ అంటూ ఎస్పీతో జీవన్‌రెడ్డి వాదించారు. రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో విప్ లక్ష్మణ్‌కుమార్ కలుగుజేసుకునేందుకు యత్నించగా, ‘బాబూ.. నీకో దండం.. నీ పార్టీకో దండం.. మమల్ని బతుకనివ్వండి’ అంటూ ఎమ్మెల్సీ దండంపెట్టి మరీ మండిపడ్డారు. ‘పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఇలాంటి ఘటనలు జరిగేందుకు కారణమవుతున్నారు. ఇన్నాళ్లూ ఎవరి మీద పోరాటం చేశామో వారి చేతుల్లో ఇప్పుడు చంపబడుతున్నాం. ఏకంగా మమ్మల్ని ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయాలని చూస్తున్నారు.. నా అనుకున్నవాళ్లకు అవసరమైతే ఎన్జీవో పెట్టుకొని సేవచేస్తా.. అంతేగాని అనుచరులను, అయినోళ్లను పోగొట్టుకోలేను’ అంటూ జీవన్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు.
మీ బొంద తీసుకుంటరు..
రంగారెడ్డి తనకు తమ్ముడిలాంటి వాడని, 30 ఏండ్లుగా తనవెంట ఉన్నాడని, పోలీసుల నిర్లక్ష్యం వల్లే హత్యకు గురయ్యాడని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పోలీసులపైకి జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. గంగారెడ్డిని చంపుతానని బత్తిని సంతోష్ అనే వ్యక్తి బెదిరించాడని, ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. బతుకమ్మ పండుగ రోజు నిందితుడు డీజేను పగులగొట్టాడని, దసరా పండుగ రోజు గంగారెడ్డిపై దౌర్జన్యం చేశాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం ఏమిటని మండిపడ్డారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఎమ్మెల్సీని సముదాయిస్తూ చర్యలు తీసుకుంటామని చెప్పగా, ‘మీ బొంద తీసుకుంటారు.. ఏం చర్యలు తీసుకుంటారు.. చచ్చాక తీసుకుంటరా? మీ ఎస్ఐ కాల్ రికార్డులు తీయండి.. హంతకుడికి, ఎస్ఐకి సంబంధం ఉన్నదా? లేదా? తెలుస్తుంది.. ఎన్నిమార్లు మాట్లాడుకున్నది తెలుస్తుంది’ అంటూ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ’20 కేసులు ఉన్నవాడితో పోలీసులకు స్నేహం ఏంటి’ అని నిలదీశారు.
కాంగ్రెస్‌లో కొనసాగలేను : పీసీసీ చీఫ్‌తో జీవన్‌రెడ్డి
గంగారెడ్డి మృతదేహానికి జగిత్యాల దవాఖానలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ లక్ష్మణ్ కుమార్ అక్కడే ఉన్నారు. అదే సమయంలో టీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఎమ్మెల్సీకి ఫోన్ చేసి మాట్లాడారు. ‘నా వాళ్లను చంపుతున్నారు.. నన్ను, కార్యకర్తలను అవమానిస్తున్నారు.. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను, మా బతుకులు మమల్ని బతుకనివ్వండి. కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవ చేస్తున్నందుకు నాకు మంచి బహుమతి ఇచ్చిండ్రు’ అంటూ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. పీసీసీ అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడుతుండగానే, జీవన్‌రెడ్డి ఆవేశంతో ఫోన్ కట్‌చేసి విసిరికొట్టారు.
ఇంకెక్కడి పార్టీ.. గంగల పార్టీ
కాంగ్రెస్ రాజ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు చచ్చిపోతున్నారని, పార్టీయే చంపుతున్నదని జీవన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఓ సందర్భంలో కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అని వ్యాఖ్యానించగా, ‘ఇంకెక్కడి పార్టీ గంగల పార్టీ’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. చివరికి పోలీసులు ఎమ్మెల్సీకి నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు. నిందితులపై, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించి జీవన్‌రెడ్డి దవాఖానకు వెళ్లిపోయారు.