మూసీ డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం పడుతుందని జనవరిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డీపీఆర్ లేదని చెప్పారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందని ప్రభుత్వం చెప్తున్నదే నిజమైతే, రెండు నెలల మెరుపు వేగంతో ఎలా సాధ్యమైందో చెప్పాలి.
-కేటీఆర్
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ‘మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తయారీ రిపోర్టు మొదలు బఫర్ జోన్ నిర్ధారణ, ఇండ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు ఇలా ప్రతి అంశంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తున్నది. పొంతనలేని సమాధానాలు, పూటకో మాట చెప్తున్నది. ప్రభుత్వానికి ఏమైనా స్పష్టత ఉన్నదా? ఉంటే సభలో ప్రవేశపెట్టాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వాదనల్లోని డొల్లతనాన్ని, విరుద్ధ అంశాలను శాసనసభ వేదికగా నిలదీశారు. ఇష్టారీతిన కొనసాగిస్తున్న ఇండ్ల కూల్చివేతలను ప్రశ్నించారు. వాటికి సర్కార్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఉదయం కొనసాగిన ప్రశ్నోత్తరాల్లో కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై పలు ప్రశ్నలు సంధించారు. ‘డీపీఆర్‌ను ప్రభుత్వం రూపొందించిందా? ఒకవేళ ఉంటే ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? ప్రాజె క్టు వల్ల నిర్వాసితులయ్యే కుటుంబాలు ఎన్ని? ఆ కుటుంబాలకు ప్రభుత్వం అందించే పునరావాస సౌకర్యాలేమిటి? తదితర వివరాలు వెల్లడించాలి’ అని కేటీఆర్ కోరారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి 18 నెలల సమయం పడుతుందని జనవరిలో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వయంగా ప్రకటించారని కేటీఆర్ గుర్తుచేశారు. ఇటీవల నిర్వహించిన సమావేశంలో మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ సైతం డీపీఆర్ లేదని చెప్పారని తెలిపారు. ప్రభుత్వం చెప్తున్నదే నిజమైతే, మరి రెండు నెలల మెరుపు వేగంతో ఎలా సాధ్యమైందో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. డీపీఆర్ ఉంటే సభలో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా రూ.16 వేల కోట్లతో సుందరీకరణ పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని, కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ప్రాజెక్టును లక్షన్నర కోట్లకు పెంచారని, దాని వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం ఒకవైపు లక్షన్నర కోట్లు అంటుంటే, సభలో మాత్రం రూ.నాలుగైదు వేల కోట్లని చెప్తున్నారని, అందులో ఏది నిజమని నిలదీశారు.
ప్రస్తుతం మొదటి ఫేజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రభుత్వం చెప్తున్నదని, మరి మొత్తంగా ప్రాజెక్టును ఎన్ని దశల్లో అమలు చేస్తారు? ఎంత భూసేకరణ చేస్తారు? ఎన్ని ఇండ్లు కూల్చివేస్తారు? అనే విషయాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని కోరారు. ప్రభుత్వం 1,400 ఇండ్లు కూల్చివేస్తామని చెప్తున్నారని, కానీ ఇటీవల గెజిట్‌లో మాత్రం 10వేల ఇండ్లని పేర్కొన్నదని, 3,297 ఎకరాల భూసేకరణ ఉంటుందని తెలిపిందని పేర్కొన్నారు. అది పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ అని మండిపడ్డారు. మధుపార్ కోసం ప్రత్యేకంగా ఇండ్లు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం మిగతా వారికి ఎందుకు ఇవ్వదని నిలదీశారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని చెప్తూనే, మరోవైపు 5 కిలోమీటర్ల దూరంలోని హనుమాన్‌నగర్‌కు నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని విమర్శించారు. బఫర్‌జోన్‌ను విస్తరించామని స్థానిక ఆర్డీవో చెప్తున్నారని, అసలు బఫర్ జోన్ ఎంత వరకు పెంచారో, దానికి ప్రమాణాలు ఏమిటో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.
ఏడీబీ కాకపోతే పీపీపీ మాడల్: దుద్దిళ్ల
కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పకుండా ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదురుదాడికి దిగారు. అవసరమైతే, మూసీ ప్రాజెక్టు అంశంపై షార్ట్ డిస్కషన్ పెట్టి వివరాలు వెల్లడిస్తామని దాటవేశారు. మూసీ పునరుజ్జీవంపై బీఆర్ఎస్ బురద చల్లేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. ప్రాజెక్టు మొదటిదశ డీపీఆర్‌లో రూ.6,500 నుంచి రూ.7,000 కోట్లు వ్యయమవుతుందని స్పష్టంగా చెప్తున్నామని, దాపరికాలేవీ లేవని వెల్లడించారు. తాము ఏది మొదలు పెట్టినా అభాండాలు వేయడం బీఆర్ఎస్కు అలవాటై పోయిందని విమర్శించారు. డీపీఆర్ రూపొందించిన మెయిన్‌హార్ట్ సంస్థకు విశేష అనుభవం ఉన్నదని, రెండు నెలల్లో డీపీఆర్ తయారు చేశామనడం అబద్ధమని, 2025 జనవరిలోనే మొదలు పెట్టామని, దాదాపు ఏడాది సమయం పట్టిందని తెలిపారు. రుణం కోసం ఏడీబీకి డీపీఆర్ పంపించామని, త్వరలోనే దానికి ఆమోదం లభిస్తుందనే భావిస్తున్నామని తెలిపారు. ఏ పరిస్థితుల్లోనైనా ఏడీబీ తిరస్కరిస్తే ప్రైవేట్ ఫైనాన్స్‌లు, లేదంటే పీపీపీ మాడల్, ఇతరత్రా మార్గాల్లో నిధుల సమీకరణకు మార్గాలు అన్వేషిస్తామని తెలిపారు. ప్రాజెక్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగుతుందని స్పష్టంచేశారు.
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్
మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలపై కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్రంగా నిలదీశారు. డీపీఆర్ తయారీ, ఇండ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు, ప్రభుత్వం చేస్తున్న విభిన్న ప్రకటనల్లోని వైరుధ్యాలను ఎత్తిచూపుతూ సర్కార్‌ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ వేసిన ప్రశ్నలు వేటికీ కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన సమాధానలివ్వలేదు. దీనిపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. సర్కార్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మరోసారి మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించిందే కేసీఆర్ ప్రభుత్వమని గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్ట్ పేరిట లక్షన్నర కోట్ల దోపిడీకే వ్యతిరేకమని వెల్లడించారు. ప్రాజెక్టు పేరిట ప్రజల ఆస్తులు, ఇండ్లు, జీవనోపాధిని దెబ్బతీసే చర్యలను బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని, పారదర్శకత లేకుండా తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తామని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టుకు సంబంధించి ఏ అంశంపైనా ప్రభుత్వం వద్ద స్పష్టమైన సమాధానం లేదని, సరైన వివరాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఫైవ్‌స్టార్ హోటళ్లలో కాకుండా, బాధితులతో ప్రజల మధ్యే ప్రజెంటేషన్ ఇవ్వాలని, ఆ కారణంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజెంటేషన్‌కు బీఆర్ఎస్ హాజరుకాలేదని స్పష్టం చేశారు. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్సేనని, ఇప్పుడు అదే పార్టీ ప్రజల పేరిట లక్షన్నర కోట్ల అవినీతికి పాల్పడేందుకు సిద్ధమైందని మండిపడ్డారు. ప్రభుత్వం వద్ద డీపీఆర్ ఉంటే వెంటనే సభలో ప్రవేశపెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి కేటీఆర్ వాకౌట్ చేశారు.
మూసీ ప్రజలకు నిద్రాహారాలు కరువయ్యాయి: సుధీర్‌రెడ్డి
ప్రశ్నోత్తరాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు అడిగారు. మూసీ సుందరీకరణకు అడుగులు పడిందే బీఆర్ఎస్ హయాంలోనని వివరించారు. మూడు పద్ధతుల్లో సుందరీకరణ చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు. మొదట మురుగునీరు మూసీలో చేరకుండా ఎస్టీపీలను ఏర్పాటు చేసి శుద్ధిచేసిన తరువాత జలాలను వదలాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ తరువాత మూసీ రివర్‌బెడ్‌లో ఏండ్లుగా పేరుకుపోయిన ఒండ్రుమట్టి, సిల్ట్‌ను తొలగించి ఇరువైపులా బండ్ ఏర్పాటు చేయాల్సి ఉన్నదని వివరించారు. మూడో దశలో సుందరీకరణ చేపట్టాలని, అందుకు అనుగుణంగానే కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసిందని గుర్తుచేశారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా పలు చోట్ల సుందరీకరణ చేపట్టిందని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇష్టారీతిన మూసీ ప్రాజెక్టు పేరిట ఇండ్లను కూల్చివేస్తున్నదని, ప్రజలకు నిద్రాహారాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు.
ఏడీబీ రుణంపైనా అసత్యాలు
మూసీ ప్రాజెక్టుకు రుణమివ్వడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంగీకరించిందని మంత్రి శ్రీధర్‌బాబు గత సభలో చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే, వాస్తవాలను తెలుసుకునేందుకు మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ) సభ్యులు సదరు బ్యాంక్ అధికారులను జనవరి 23 సంప్రదించారని, వివరాలు ఆరా తీశారని తెలిపారు. తమకు ఎలాంటి డీపీఆర్ అందలేదని, కాబట్టి రుణంపై ఎలాంటి అంగీకారం లేదని బ్యాంకు ప్రతినిధులే స్పష్టంచేశారని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 11న కూడా అదే విషయాన్ని ఏడీబీ మరోసారి స్పష్టం చేసిందని వివరించారు. ఆరు గ్యారెంటీల అమలుకు డబ్బులు లేవని చెప్తున్న ప్రభుత్వం.. మరి మూసీ ప్రాజెక్ట్‌కు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ తయారీ బాధ్యతలను మెయిన్‌హార్ట్ అనే కంపెనీకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని, సదరు కంపెనీని సింగపూర్, పాకిస్తాన్, మనదేశంలోని ‘ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా’ తదితర సంస్థలు సైతం నిషేధించాయని తెలిపారు. అలాంటి సంస్థను ప్రభుత్వం ఎందుకు ఎంపిక చేసిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ పూటకో మాట చెప్తున్నదని, ఆచరణలో ఒకటి చేస్తున్నదని నిప్పులు చెరిగారు. డీపీఆర్‌ను సభలో ప్రవేశపెట్టి సందేహాలన్నీ నివృత్తిచేయాలని, ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం మూసీ మొదటి ఫేజ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రభుత్వం చెప్తున్నది. ప్రాజెక్టును ఎన్ని దశల్లో అమలు చేస్తరు? ఎంత భూమి సేకరిస్తరు? ఎన్ని ఇండ్లు కూల్చివేస్తరో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. 1,400 ఇండ్లు కూల్చివేస్తామని చెప్తున్నరు. కానీ ఇటీవల గెజిట్‌లో మాత్రం 10 వేల ఇండ్లు అని పేర్కొన్నరు. 3,297 ఎకరాల భూసేకరణ ఉంటుందని చెప్పిండ్రు. అంటే ఇదంతా పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ. -కేటీఆర్