ఖైరతాబాద్, మార్చి 18 : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుల ప్రోద్బలంతో తమ పొలాన్ని కొందరు కబ్జా చేయాలని చూస్తున్నారని ఖమ్మం జిల్లా కేంద్రంలోని మంగళగూడెం గ్రామానికి చెందిన రైతు కొప్పుల జగదీశ్ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన కబ్జా వివరాలు వెల్లడించారు. గ్రామంలోని సర్వే నంబర్లు 830, 831, 843, 844, 845, 847లో సుమారు 7.9 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నదని, గత 42 ఏండ్లుగా సాగుచేసుకుంటున్నట్టు తెలిపారు. సదరు భూమిని కొందరు కబ్జా చేయాలని గత 18 ఏండ్లుగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. 2008లో తమకు సంబంధించిన 6 ఎకరాల భూమిని కొందరు దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఈ విషయాన్ని అప్పటి కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క దృష్టికి తీసుకెళ్లామని, నాటి ఎస్సై మధ్యవర్తిగా వ్యవహరించి కేసు పెట్టవద్దని చెప్పడంతో తాము వెనక్కి తగ్గామని చెప్పారు.
2019లో మరోసారి కబ్జాకు ప్రయత్నాలు మొదలుపెట్టారని, తప్పుడు ధ్రువపత్రాలతో భూకబ్జాకు యత్నించారని తెలిపారు. దీంతో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు దృష్టికి తీసుకెళ్తే రెవెన్యూశాఖ సబ్ కలెక్టర్‌ను విచారణకు ఆదేశించారని, దీంతో తహసీల్దార్ ద్వారా బహిరంగ విచారణ జరిపి పబ్లిక్ నోటీస్ జారీ చేశారని చెప్పారు. అప్పటి నుంచి పదే పదే తమ భూముల్లోని పంటలను ధ్వసం చేస్తున్నారని, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. కబ్జాదారుల వెనుక మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో పనిచేసే దయాకర్రెడ్డితోపాటు ఎంపీ ఆఫీస్ ఇన్చార్జి కొప్పుల చంద్రశేఖర్ ప్రోద్బలంతో ఈ కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాడు కేసు పెట్టవద్దని చెప్పిన ఎస్సై, నేడు ఏసీపీ హోదాలో వచ్చి నిందితులకు వంతపాడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీపీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట కోయనివ్వకుండా అడ్డుకుంటున్నారని, దీంతో పంట దెబ్బతింటున్నదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతు కొప్పుల జగదీశ్ విజ్ఞప్తి చేశారు.