హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికే స్పష్టత లేదని, అయినా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బఫర్‌జోన్‌లో ఉన్న మంత్రులు, అధికార పార్టీ నాయకుల ఇండ్లను వదిలేసి, దూరంగా ఉన్న ప్రాంతాలవారికి నోటీసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బుధవారం అసెంబ్లీలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మూసీ ప్రాజెక్టు, వడ్డీలేని రుణాలు, గవర్నర్ ప్రసంగం, పరిపాలనా వైఫల్యాలపై ప్రశ్నలు లేవనెత్తారు. గవర్నర్ ప్రసంగంలో లోపాలు ఉన్నాయని, వడ్డీలేని రుణాలపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు కట్టబెడుతున్నదని, రాష్ట్రంలో అధికార యంత్రాంగం నియంత్రణ తప్పిందని ఆరోపించారు. మొత్తంగా ‘ఇది సర్కార్ కాదు, సర్కస్’ అని ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించారు.
మూసీ పేరుతో రియల్ వ్యాపారం
మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి స్పష్టతలేకపోవడంతో పైసా ఇచ్చినోడు లేడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రాజెక్టు విషయంలో అధికారులు పరిధి దాటి అతిగా ప్రవర్తిస్తున్నారని, ఆరు నూరైనా పూర్తి చేస్తామని అంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అధికార యంత్రాంగం నియంత్రణ తప్పిందని ‘కుక తోకను ఆడించడం కాదు.. తోక కుకను ఆడించినట్టు’గా పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ అక్రమాలకు తలొగ్గే అధికారులకు భవిష్యత్‌లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మూసీ ప్రాజెక్టుపై సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హకుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని తెలిపారు. బఫర్‌జోన్‌కు దూరంగా ఉన్న హనుమాన్‌నగర్ వంటి ప్రాంతాల్లోని ప్రజలకు బఫర్‌జోన్ పేరుతో నోటీసులివ్వడం అన్యాయమన్నారు. మంత్రులు పొంగులేటి, వివేక్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వంటి నేతల ఇండ్లు కూడా అదే జోన్లో ఉన్నాయని, రేవంత్‌రెడ్డి సోదరుడి ఇల్లు ఏకంగా ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నదని ఆరోపించారు. అమీన్పూర్లో కూల్చివేసిన ఇండ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. తాజ్ కృష్ణలో నిర్వహించిన పీపీటీ ప్రదర్శనకు తాము రాలేదని ప్రభుత్వం విమర్శించడం హాస్యాస్పదమన్నారు. తాము నేరుగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకున్నామని తెలిపారు. వెలుగుమట్ల వంటి ప్రాంతాలకు ప్రభుత్వ పెద్దలు ఎందుకు వెళ్లి పరామర్శించలేదని ప్రశ్నించారు. మధు పార్ రిడ్జ్కు మాత్రమే ప్రత్యేకంగా పునరావాసం ఇస్తామని చెప్పడం వెనుక ఉద్దేశమేమిటో వివరించాలని నిలదీశారు. మొత్తంగా మూసీ ప్రాజెక్ట్ పేరుతో భారీ అవినీతి, భూముల దోపిడీ కొనసాగుతున్నదని, ప్రభుత్వం వెంటనే పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేయడమే ప్రభుత్వం అవినీతి వైఖరిని చూపుతున్నదని విమర్శించారు.
కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు..?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం భూసేకరణ చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఆ భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఇతరులకు ఇవ్వాలని చూస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు, ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఎస్టీపీలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని, కానీ అధికార పార్టీ మాత్రం తప్పించుకుంటున్నదని మండిపడ్డారు. ‘మా పార్టీ బీఫామ్ మీద గెలిచి, కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు క్లీన్చిట్ ఇచ్చారు. మమ్మల్ని తిడితే ఖండించలేదు. అలాంటప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు? ప్రభుత్వం మమ్మల్నే తట్టుకోవడం లేదు. కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు?’ అని ప్రశ్నించారు.
సీఎం వ్యాఖ్యలే ప్రస్తావించా..
శాసనసభలో తాను ఎకడా అన్ పార్లమెంటరీ భాష ఉపయోగించలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలనే తాను ప్రస్తావించానని, అవి రికార్డులో ఉంటే తాను చెప్పినవి కూడా రికార్డులో ఉండాలని వివరించారు. ‘నేను నిన్న మాట్లాడిన దాంట్లో అన్ పార్లమెంటరీగా ఏం మాట్లాడానో ఎవరూ కోట్ చేయలేదు. అలా మాట్లాడానని నేను కూడా అనుకోవట్లేదు. అలాంటి మాటలు మాట్లాడి ఉంటే స్పీకర్ అప్పుడే ఆపేవారు. నేను ముఖ్యమంత్రిలా బలిదేవత అన్నానా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
రాజీనామా ఎవరు చేస్తారు?
గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు ఉన్నాయని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ‘మహిళా సంఘాలకు రూ.57వేల కోట్ల రుణాలు అందించామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార కూడా ఇదే చెప్తున్నారు. మంత్రి సీతక్క నన్ను రాజీనామా చేయమని అంటున్నారు. రుణాలు నిజంగా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని నేను ఇప్పటికే ప్రకటించాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, రుణాలిచ్చినట్టు ఆధారాలు చూపిస్తే కచ్చితంగా రాజీనామా చేస్తా’ అని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో అబద్ధాలు చెప్పినవారే రాజీనామా చేయాలని, డిప్యూటీ సీఎం భట్టి రాజీనామా చేస్తారా? లేదా మంత్రి సీతక రాజీనామా చేస్తారా? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.