సిటీబ్యూరో, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టెండర్ల అక్రమాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్నది. టెండర్ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని, కేవలం కొందరికే ప్రయోజనం చేకూరేలా.. నిబంధనలను రూపొందించి నిర్వహణ పనులు అప్పగిస్తున్న కొందరు ఇంజినీర్ల పనితీరుపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశంగా మారింది. జీవో నంబరు 94, 66లకు విరుద్ధంగా తెరపైకి కొత్త నిబంధనలను చేర్చుతూ అనుకూల వ్యక్తికే నిర్వహణ పనులు కట్టబెడుతున్నారని కాంట్రాక్టర్లు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో సుమారు రూ. 21.25 లక్షల విలువైన రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్ పనుల టెండర్ అంశాన్ని ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా సదరు కాంట్రాక్ట్‌ను అప్పగించడమే కాకుండా ఇదే తరహా అల్వాల్‌లో టెండర్ ఐడీ (686995) మరో రూ. 20 లక్షల పనుల అప్పగింతలో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నదని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. జీవో ప్రకారం ఉండాల్సిన టర్నోవర్ నిబంధనలను పకనపెట్టి, పదేండ్ల రిపోర్టులు అడగటం, అలాగే లేన్ మారింగ్ మెషిన్ వంటి ఖరీదైన యంత్రాల ఇన్వాయిస్లు కావాలని కోరడం అశనిపాతంగా మారిందంటూ చిన్న కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
సాధారణంగా 50 లక్షల లోపు విలువ గల పనులకు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ప్రత్యేక షరతులు విధించకూడదనే నిబంధన ఉంది. అయితే ప్రస్తుతం మలాజిగిరిలో సుమారు రూ. 21.25 లక్షల విలువైన రంబుల్ స్ట్రిప్స్, జీబ్రా క్రాసింగ్ పనుల టెండర్లో నిబంధనలకు విరుద్ధంగా కఠినమైన షరతులు పెట్టి చిన్న తరహా కాంట్రాక్టర్లను టెండర్ ప్రక్రియకు దూరం చేసి అనుకూల వ్యక్తికి కాంట్రాక్ట్ అప్పగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ టెండర్లో రన్నింగ్ మీటర్ చొప్పున నిబంధన..కానీ యంత్రాల నిబంధన తెరపైకి తీసుకువచ్చారు. చిన్న పనులకైనా లేన్ మారింగ్ మెషిన్ ఇన్వాయిస్లు సమర్పించాలని కోరడం వెనుక ఆంతర్యం ఏమిటని కాంట్రాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. సాధారణ పనులకు సైతం ఐఎస్ఓ సర్టిఫికెట్ల వంటి అనవసరమైన నిబంధనలు చేర్చి, అర్హులైన వారిని పోటీ నుంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.
మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహణ పనుల టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ స్థానిక కాంట్రాక్టర్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా టెండర్ ఐడీ (686545) కింద చేపట్టిన పనుల్లో ప్రభుత్వ మార్గదర్శకాలను, జీవో నంబరు 94, 66లను అధికారులు బేఖాతరు చేస్తున్నారని కమిషనర్ వినమ్ కృష్ణారెడ్డికి ఫిర్యాదులు అందాయి. టెండర్ ప్రక్రియలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకు తనకు ప్రాణహాని తలపెట్టేలా బెదిరింపులకు పాల్పడుతున్నారని విజయ్ కుమార్ అనే కాంట్రాక్టర్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) నిబంధనలకు విరుద్ధంగా ట్రైలర్-మేడ్ షరతులు పెట్టి, కేవలం ఒకే ఏజెన్సీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ. 21 లక్షల చిన్న పనికి సైతం భారీ యంత్రాల ఒరిజినల్ ఇన్వాయిస్లు అడగటం వెనుక భారీ ముడుపులు అందాయనే అనుమానాన్ని కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై స్పందించిన కమిషనర్ వెంటనే సంబంధిత టెండర్ తాలుకా సమగ్ర వివరాలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.