Gorati Venkanna | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ నిర్మించారని చెప్పి జనం చూడకుండా విగ్రహం గేటుకు తాళం వేయటం ఏ రకమైన ప్రజాస్వామ్యం అని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న నిలదీశారు. శాసనమండలిలో శుక్రవారం రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. జనసంఘ్‌కు చెందిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ, రిపబ్లికన్ పార్టీకి చెందిన అంబేద్కర్ భిన్న భావజాలాలు గల వ్యక్తులని, ఆ ఇద్దరు ఒకే వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించుకున్నారని చెప్పారు. అది భారతీయ ప్రజాస్వామ్యానికి ఉన్న లక్షణమని అన్నారు. సరిగ్గా దానికి భిన్నంగా అంబేద్కర్ విగ్రహానికి తాళం వేస్తే ఏ రకమైన ప్రజాస్వామ్యం అని అనుకోవాలని నిలదీశారు. తమిళనాడులో జయలలిత పెట్టిన అమ్మ క్యాంటీన్‌ను స్టాలిన్ తొలగించలేదని, ఆమె ఫొటోతోనే కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు.
రైతుభరోసా అందరికీ ఇవ్వాలి
రైతుబంధు పథకంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు దేవుడు అయిండని గోరటి వెంకన్న కొనియాడారు. ‘ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా, అరటెద్దును అమ్మి అరువుకిచ్చిరి పొలము’ అని తాను రాసిన పాట పాడి వినిపించారు. ఇదే సభలో రైతుబంధు మీద తాను కొంత వ్యతిరేక భావంతో మాట్లాడినట్టు గుర్తుచేసుకున్నారు. కానీ 20 ఎకరాలు ఉన్న రైతుకు కూడా తప్పకుండా రైతుబంధు ఇవ్వాలని ప్రతిపాదించారు. బంజరు భూములు, బీడు భూములు, రియల్ ఎస్టేట్ భూములను రైతుభరోసా నుంచి మినహాయించవచ్చని, కానీ ఐదు ఎకరాలకు మించిన రైతులకు భరోసా ఇవ్వం అనటంలో అర్థం లేదని అన్నారు. రైతు భరోసాకు రూ.50 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయిందని, రైతుల దగ్గర పైసలుంటే సాగు మీద పెట్టుబడి పెడుతరని, రైతుబంధు పథకంతోనే సారును (కేసీఆర్) రైతులు దేవుడని పొగుడుతున్నరని’ చెప్పారు.
ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల ఘనత కేటీఆర్‌దే
పదేండ్ల క్రితం 2014లో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించిన ఐటీ రంగం.. 2023 నాటికి 10 లక్షల మందికి ఉపాధినిచ్చే స్థాయికి ఎదిగిందని, అది కేటీఆర్ గొప్పతనమని గోరటి వెంకన్న కొనియాడారు. దీన్ని ఇప్పటి ప్రభుత్వం మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించిన ఘనత కేటీఆర్‌దే అన్నారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నగరాలు గొప్పవి.. పల్లెలు పనికిరావని అన్నారని, వైఎస్సార్ సీఎంగా వచ్చాక పల్లెలకు ప్రాముఖ్యత ఇచ్చారని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక అటు పల్లెలు, ఇటు పట్టణాలు రెండింటి సమ్మిళిత అభివృద్ధిని చేసి చూపించారని వివరించారు. ఫార్మా హబ్‌ను, ఫ్యూచర్‌సిటీని కలిపి పెడతామనటంలో ఏదో కిరికిరి కనిపిస్తున్నదని అనుమానం వ్యక్తంచేశారు. అమరావతికి, ఫ్యూచర్‌సిటీకి మధ్య ఏదో సంబంధం కనిపిస్తున్నదని అన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ మూలాలు అమరావతికి దగ్గరగా ఉన్నాయని ఆరోపించారు.