హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పగ, ప్రతీకారాలతో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇది నోటీసుల, నోటిదూల సర్కార్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు సృష్టించిన రాజకీయ నయీం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని సంచలన ఆరోపణలు చేశారు. మూర్ఖత్వంతో బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అనాగరిక భాషతో బీఆర్ఎస్ నాయకులను తిట్టడమే కాంగ్రెస్ పాలకులకు తెలుసు అని, ప్రజాపాలనపై వారికి చిత్తశుద్ధి లేనే లేదని చెప్పారు.
ఫ్యూచర్‌సిటీ పేరుతో అక్కడి భూములను తన బినామీలకు కట్టబెట్టాలని, మూసీ ప్రక్షాళన పేరుతో అక్కడి భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ బ్రోకర్ గుణం అనేది సీఎం రేవంత్ నుంచి తొలిగిపోవడం లేదని దుయ్యబట్టారు. మేధోమథనం చేసే ఆలోచనే ఈ సీఎంకు లేదని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా, రాజకీయ విషపు క్రీడను రేవంత్ నడిపిస్తున్నాడని ధ్వజమెత్తారు.
ఫోన్‌ట్యాపింగ్ జరిగిందంటూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హైడ్రామాపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరిపించడం లేదు? దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలి.. అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. ఈ అంశంపై దావోస్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. సిరిసిల్లలో ఫోన్‌ట్యాపింగ్ జరిగినట్టు తమరు చూశారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ అన్నట్టు ఆర్ఆర్ ట్యాక్స్ గురించి ఎందుకు మాట్లాడరు ? అని నిలదీశారు. ఫామ్‌హౌస్ నుంచి ఏఐసీసీకి నిధులు పోతున్నాయని బండి సంజయ్ ఎలా అంటున్నారు? ఆయనేమన్నా ఫామ్‌హౌస్ వద్ద పడుకొని చూస్తున్నాడా? అని ఎద్దేవా చేశారు. బహుజన జర్నలిస్టులపైన కేసులు పెడుతున్న రేవంత్‌రెడ్డి.. అడ్డమైన ఆరోపణలు చేస్తున్న బండి సంజయ్‌పై ఎందుకు కేసు పెట్టడం లేదని ప్రశ్నించారు.
‘సిట్ పేరిట విచారణలు, కేసులు కాదు. దమ్ముంటే అసెంబ్లీని రద్దుచేసి, ప్రజాక్షేత్రంలోకి రండి. ముందస్తు ఎన్నికలు జరుపండి. అప్పుడు ఎవరి దమ్ము ఏందో తెలిసిపోతుంది’ అని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సవాల్ విసిరారు. అలవికాని హామీలు అనేకం ఇచ్చి, రెండేండ్ల పాలనలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.