ఇప్పటికైనా రాజీవ్‌గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి. అలా కాదని మొండికేస్తే తెలంగాణలో అలజడి మొదలవుతుంది, ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి ఉంటుంది. తెలంగాణ అస్థిత్వం మీద దాడి చేయడం మానాలి.
-దేశపతి శ్రీనివాస్
BRS | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న చోట రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ముమ్మాటికీ మన అస్తిత్వంపై దాడేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ప్రతీక అయిన తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం, అమరజ్యోతి మధ్యలో ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నదని అన్నారు. దేశమంతా ఓ వైపు స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు జరుపుకుంటుంటే ఇకడ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ స్వాభిమానం మీద దాడి చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణ స్వాభిమానాన్ని దెబ్బతీసేందుకు రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ఏనాడు ప్రాంతీయ అకాంక్షలు తెలియవని, ఆ పార్టీ అప్రజాస్వామిక విధానాల కారణంగానే అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టాయని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి తెలంగాణ సోయి లేదని, ఆయన వలసవాద పుత్రుడని దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో.. ఎవరైనా చంద్రబాబు దగ్గరికి వస్తే ప్రాణాలు తీస్తా అన్నట్టు రేవంత్ రైఫిల్ పట్టుకుని తిరగాడని ఆరోపించారు. రేవంత్ సీఎం అయ్యాక జై తెలంగాణ నినాదం మసకబారి పోయిందని, ఆ స్థానంలో జై సోనియా, జై కాంగ్రెస్ నినాదాలు వచ్చాయని మండిపడ్డారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ అధికార చిహ్నంలోని చార్మినార్, కాకతీయ తోరణాలను రాచరిక చిహ్నాలని అవహేళన చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, రాహుల్‌గాంధీ తండ్రి రాజీవ్‌గాంధీ విగ్రహం కాదని డిమాండ్‌చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల ప్రతీక అని, వ్యక్తి కాదనే విషయాన్ని గుర్తించాలని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజీవ్‌గాంధీ ఒక వ్యక్తి అని గుర్తు చేశారు. రాజకీయ సంకుచిత వైఖరి, మొండివైఖరితో వ్యవహరిస్తే ఉద్యమించక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలా లేక రాహుల్‌గాంధీ తండ్రి విగ్రహం కావాలా ప్రజలు తేల్చుకోవాలని సూచించారు.
రాజీవ్‌గాంధీకి తెలంగాణకు ఏం సంబంధం అని దేశపతి ప్రశ్నించారు. తెలంగాణతో సోనియా గాంధీకి సంబంధం ఉందన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టే ముందు తెలంగాణ మేధావులతో ఏమైనా చర్చలు జరిపారా? కనీసం కోదండరాం, హరగోపాల్, అందెశ్రీ అభిప్రాయాలనైనా తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. వారు ముగ్గురైనా రాజీవ్‌గాంధీ విగ్రహం అకడ వద్దని రేవంత్‌కు సూచిస్తే మంచిదని అన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి తెలంగాణ సచివాలయానికి ఏం సంబంధం అని బీఆర్ఎస్ నేత జీ దేవీప్రసాద్ ప్రశ్నించారు. సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ప్రజల మనసును గాయపరచడమేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ విగ్రహం విషయంలో ప్రభు త్వం పునరాలోచించాలని, లేకుంటే ప్రజల ధర్మాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.