హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మెట్రో రైలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుగ్లక్ మార్క్ చర్యలతో విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రోజుకో విధానంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి మెట్రోరైల్ కట్టినోడు కాదు..రూపాయి పెట్టినోడు కాదని ఎద్దేవా చేశారు. మెట్రో ఆస్తుల వివరాలు తెలియకముందే ఐఆర్ఎఫ్సీకి సంతకం ఎలా పెట్టారని, అప్పు తేలకముందే రూ.130 కోట్ల మిత్తికి ఎందుకు ఒప్పుకొన్నారని నిలదీశారు. కిషన్‌రెడ్డి, కేటీఆర్ కలిసి మెట్రోకు ఇచ్చే రుణాన్ని అడ్డుకొన్నారని ఆరోపించిన సీఎం రేవంత్‌రెడ్డి.. అదే కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రిని కలువడంలోని మతలబేమిటని ప్రశ్నించారు.
బుధవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ నెపంతో ఎల్ అండ్ టీని భయపెట్టి, మహాలక్ష్మీ స్కీమ్‌తో మహిళా ప్రయాణికులు తగ్గారని బెదిరించి ప్రాజెక్ట్‌ను బలవంతంగా టేకోవర్ చేశారని ఆరోపించారు. ‘అప్పు చేతికి రాకముందే ఏప్రిల్ 29న ఎస్పీఏ సంతకం చేసి రూ.13,538 కోట్ల పాత అప్పు బాధ్యత తీసుకొన్నారు. కానీ, ఐఆర్ఎఫ్సీ రుణం రాలేదు.. జపాన్‌కు చెందిన సంస్థ అదృశ్యమైంది. కొత్తలోన్ రాకముందే పాత అప్పుపై అధిక వడ్డీ రోజుకు రూ.2.5 కోట్ల చొప్పున కడుతున్నారు. జూన్ 15 నాటికి రూ.130 కోట్ల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరైంది. ఎస్బీఐ క్యాప్స్ రిపోర్ట్ వచ్చే ఆరు నెలల్లో ప్రజల నెత్తిన మరో రూ.45 కోట్ల భారం పడబోతున్నద’ని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. మెట్రో టేకోవర్, ఆస్తుల మదింపు పేరిట సాగుతున్న భారీ లూటీపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఉద్దేశించి 25 ప్రశ్నాస్త్రాలు సంధించారు. ఈ ప్రశ్నలకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం ద్వారా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన కోర్టుకు వెళ్లి ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేస్తామని, ప్రభుత్వాన్ని, క్యాబినెట్‌ను జవాబుదారీ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
1) ఐఆర్ఎఫ్సీ ఎందుకు విఫలమైంది? మెట్రోరైలు ద్వారా వచ్చే ఆదాయాన్ని మొదట నిర్వహణ కోసం వాడాలి. తర్వాతే అప్పు చెల్లించాలనే కేంద్రం నిబంధనకు సీఎం ఎందుకు మోకాలడ్డారు?
2. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లేవనెత్తిన నిబంధనల చికుముడి తెలిసీ ఐఆర్ఎఫ్సీ ఒప్పందంపై ఎందుకు సంతకం చేశారు?
3. ఆర్థిక శాఖ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలతో వివాదం పరిషారం కాకముందే.. ఈ ఒప్పందం చేసుకోమని రేవంత్‌రెడ్డికి ఏ దేవుడు పర్మిషన్ ఇచ్చాడు? మీ క్యాబినెట్ ఇచ్చిందా, అంతరాత్మ ఇచ్చిందా?
4. కేసీఆర్ కాళేశ్వరం కడితే ప్రకృతి వైపరీత్యంతో రెండు పియర్స్ కూలిపోతే సి ట్టింగ్ జడ్జితో కమిషన్ వేసిన రే వంత్..నేడు రూ.13,000 కోట్ల లోన్ ప్ర జలపై రుద్దేటప్పుడు కనీస విశ్లేషణ లేదా?
5. పూర్వ షరతులన్నీ నెరవేర్చామని రేవంత్‌రెడ్డి లేఖ రాస్తే.. ఒక షరతు కూడా పూర్తి చేయలేదని కిషన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఐఆర్ఎఫ్సీ ఇచ్చిన కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ సాటిస్పాక్షన్ సర్టిఫికెట్ కాపీని బహిర్గతం చేస్తారా? లేదా?
6. ఎల్ అండ్ టీ తీసుకొన్న 13,538 కోట్ల అప్పు ఇప్పటికే బ్యాంకుల్లో 8.25% నుండి 11.5% వరకు అధిక వడ్డీతో నడుస్తున్నది. ఏప్రిల్ 29న రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీఏ సంతకం చేసి ఆ అప్పు బాధ్యత తీసుకొన్నది. కొత్త లోన్ రాకముందే.. ఈ పాత అధికవడ్డీ అప్పుపై రోజుకు రూ.2.5 కోట్ల చొప్పున వడ్డీని ప్రజల సొమ్ము నుంచి బ్యాంకుకు ఎందుకు కడుతున్నారు?
7. ఇప్పటికే 130 కోట్ల ప్రజాధనం వృథా అయింది. దీనికి జవాబుదారీ ఎవరు?
8. భవిష్యత్తులో పడబోయే 450 కోట్ల అదనపు నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఈ పాపం ఎవరిది?
9. ఐఆర్ఎఫ్సీతో ఉత్తర ప్రత్యుత్తరాలు పబ్లిక్ డొమైన్లో పెడుతారా?
10. రూ.13,537 కోట్లకుపైగా అప్పు విషయంలో కనీసం విధివిధానాలపై అవగాహన లేకుండా సంతకాలు చేసిన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, హెచ్ఎంఆర్ఎల్ ప్రతినిధులను బాధ్యులను చేస్తారా? లేక ఒత్తిడి తెచ్చిన సీఎం రేవంత్‌రెడ్డిని బాధ్యుడిని చేయాలా?
11. ఐఆర్ఎఫ్సీకి కట్టిన రూ.84.32 కోట్ల ప్రాసెసింగ్ ఫీజు వెనక్కి తెచ్చేందుకు అధికారికంగా డిమాండ్ పత్రం పంపారా?
12. వివాదం పరిషారం కాకముందే ప్రజాధనం రూ.84.32 కోట్లు కట్టడానికి మంత్రివర్గం ఆమోదం తీసుకొన్నారా? ఆ డాక్యుమెంట్ బయటపెట్టాలి.
13. ఒకవేళ ఐఆర్ఎఫ్సీ రూ.84.32 కోట్లు వాపస్ ఇవ్వకపోతే, ఈ నష్టాన్ని బడ్జెట్లో రేవంత్‌రెడ్డి చూపిస్తారా? లేక భట్టి విక్రమార చూపుతారా?
14. 4% వడ్డీకి లోన్ ఇస్తానన్న జపాన్ సంస్థ పేరేంటో ఇవాల్టికైనా చెప్తారా?
15. జపాన్ సంస్థ ఐఆర్ఎఫ్సీకి రూ.13,000 కోట్ల రుణం ట్రాన్స్ఫర్ చేసిందని సీఎం చెప్పారు కదా. మరి ఆ సొమ్ము ఇప్పుడు ఐఆర్ఎఫ్సీ దగ్గర ఉన్నదా? లేక జపాన్ వాపస్ తీసుకొనిపోయిందా?
16. రేవంత్‌రెడ్డేమో రూ.84 కోట్లు, రూ.1,420 కోట్లు ఇచ్చానంటారు.. ఐఆర్ఎఫ్సీ బాధ్యులు రూపాయి కూడా రాలేదంటున్నారు.. అసలు డబ్బులు ఏ అకౌంట్లోకి వెళ్లాయి?
17. డబ్బులు ఉండీ లోన్ క్రెడిట్ చేయకపోతే, మీ చుట్టూ ఉన్న ఐఏఎస్ అధికారులు కోర్టుకు వెళ్లే ఆప్షన్ ఎందుకు పరిశీలించలేదు? కేవలం కిషన్‌రెడ్డికి ప్రేమలేఖలు రాస్తే సమస్య పరిషారమవుతుందా?
18. ఐఆర్ఎఫ్సీ ద్వారా 4% వడ్డీకి వచ్చే లోన్ పోయింది. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ ద్వారా మారెట్ నుంచి 7% నుంచి 9% వడ్డీకి లోన్ తెస్తే.. అదనపు నష్టాన్ని రేవంత్ భరిస్తారా లేక భట్టి విక్రమార్కనా?
19. ఐడీబీఐ, డీఎంఆర్సీల వాల్యూయేషన్ రిపోర్టులు ఏమయ్యాయి?
20. ఎస్బీఐ క్యాప్స్ నియామకంలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి? వాటిని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు?
21. రాయదుర్గం భూముల విషయంలో ఎస్బీఐ కోర్టుకెళ్తే.. లీడ్ బ్యాంక్ హోదా రద్దు చేస్తామని, ప్రభుత్వ అకౌంట్లు తీసేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. మరి ఇవాళ ఎస్బీఐ క్యాప్స్‌ను కన్సల్టెంట్‌గా ఏ ప్రాపదికన పెట్టుకొన్నారు? ఎన్ని కోట్లకు అగ్రిమెంట్ చేశారు?
22. ఒకవేళ రేపు ఎస్బీఐ క్యాప్స్ వచ్చి మెట్రోరైలు ఆస్తుల విలువ రూ.10 వేల కోట్లే అని చెప్తే.. అప్పటికే ఎల్ అండ్ టీకి ఎకువ చెల్లించి చేసుకొన్న ఒప్పందాలను ఎలా మారుస్తారు?
23. మెట్రోరైల్ ఇప్పుడు ఎవరి అథారిటీలో ఉంది?
24. కేసీఆర్, కేటీఆర్ వేసిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఫౌండేషన్‌ను రద్దు చేశారు. ఇప్పుడు ఎస్బీఐ క్యాప్స్ పరిధి కేవలం ఫేజ్-1 ఆస్తులేనా.. లేక రద్దు చేసిన శంషాబాద్ రూట్‌ను కూడా కలిపి స్టడీ చేస్తారా?
25. ఐఆర్ఎఫ్సీతో లావాదేవీల రద్దుకు సంబంధించిన వివరాలు, క్యాన్సిలేషన్ లెటర్స్‌ను ఎందుకు చూపడంలేదు?