MLC Dasoju | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం రాజగోపురం వద్ద శ్రవణ్‌కు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామి, అలాగే, భ్రమరాంబ అమ్మవారలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నట్లు చెప్పారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా.. అధికారులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, తీర్ధ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేసి సత్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, సతీమణి శోభమ్మ దంపతులకు ఆశీస్సులు ఉండాలని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. ఎంతటివారైనా కేసీఆర్ ముందు బాలాదూరేనంటూ కవితపై పరోక్షంగా విమర్శించారు. సంక్షోభాలు, సమస్యలు అధిగమించి మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్నారు. ప్రభుత్వ వైఫల్యం, ముందు చూపు లేకపోవడంతో రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డులో మెంబర్లుగా తెలంగాణ వాళ్లకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున అమ్మవార్ల దర్శనానికి తీసుకువస్తానన్నారు.