హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్రా కుంభకర్ణ నిద్ర లేచిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ఎద్దేవా చేశారు. వందల కోట్ల విలువైన రాయిని మంత్రి కంపెనీలు దోచుకున్నాక, 60 రోజుల తర్వాత హైడ్రా ఇప్పుడు మేలొనడం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
సామాన్యుడిపై ప్రతాపం చూపించే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇన్ని రోజులు ఎకడ ఉన్నారని ప్రశ్నించారు. ‘పొంగులేటి ఏమైనా తెలంగాణ అల్లుడా? ఎం దుకు ఈ మర్యాదలు? పొంగులేటి స్థానంలో మరెవరైనా ఉంటే హైడ్రా ఇన్ని రోజులు ఆగేదా?’ అని నిలదీశారు. పొంగులేటికి చెం దిన రాఘవ స్టోన్ క్రషర్‌పై చర్యలు తీసుకున్నామని మంగళవారం ఉదయం 9.15 గంటలకు అధికారికంగా ప్రకటించిన హైడ్రా.. మధ్యాహ్నం 12 గంటలకు అది రాఘవ కన్స్ట్రక్షన్స్ది కాదని మాట మార్చడం వెనుక ఉన్న మతలబేమిటని ప్రశ్నించారు.
ఈ మూడు గంటల్లో ఎవరు ఒత్తిడి చేశారో హైడ్రా రంగనాథ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ను కాపాడుతున్నారని, రంగనాథ్‌ను కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు చట్టప్రకారం రంగనాథ్‌కు ఏడేండ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదని చెప్పారు. తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కిశోర్‌గౌడ్, రంగినేని అభిలాశ్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
మంత్రి పదవిని అడ్డంపెట్టుకొని పొంగులేటి రాష్ట్ర సంపదను దోచుకుంటున్నారని ఆధారాలు మీడియాలో, అసెంబ్లీలో చెప్పినా రెండు నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి, రంగనాథ్ ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. ఓఆర్ఆర్ పక్కనే ఇన్నేండ్లపాటు పొంగులేటి తరలించిన రూ.500 కోట్ల విలువైన మైనింగ్ సంపదను తిరిగి ఎలా రాబడుతారో చెప్పాలని ప్రశ్నించారు. వందల కోట్ల విలువైన ప్రకృతి సంపద దోపిడీకి గురవుతుంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) అధికారులు, స్థానిక పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
మైనింగ్ స్కామ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి, పొంగులేటి ఇద్దరూ తెలంగాణను దోచుకుంటున్న రియల్ఎస్టేట్ దందాగాళ్లని విమర్శించారు. ఒకవైపు పొంగులేటి, మరోవైపు రేవంత్‌రెడ్డికి సంబంధించిన భాగ్యనగర్ క్రషర్స్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలో అక్రమంగా మైనింగ్ చేస్తున్నాయని మండిపడ్డారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ఐదేండ్ల జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు.