హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డీ.. జూబ్లీహిల్స్ గెలిచానని విర్రవీగ కు.. గతంలో జీహెచ్ఎంసీ సహా అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన విషయం మరిచిపోకు’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని, వ్యవస్థలను దుర్వినియోగం చేసి, అడ్డదారిలో విజయం సాధించి అహంకారంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై అడ్డగోలుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యను నువ్వు అవమానించలేదా? నీ సొంత సో షల్ మీడియా ద్వారా వారిని తిట్టించలేదా? అంటూ నిలదీశారు. నాడు అహంకారంతో వ్యవహరించిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సుద్దులు చెప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూసి ఓటేయలేదనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
ఒక్క ఎన్నికలో గెలువగానే ప్రజలు ఆరు గ్యారెంటీలు మరచిపోయారని, లగచర్లలో గిరిజన బిడ్డలపై అరాచకాలను విస్మరించారని, హైడ్రాను సమర్థించారని, స్కీముల పేరిట స్కాములు చేసినా ఓటేశారని, తన బావమరిది, బీజేపీ ఎంపీకి కాంట్రాక్టులు కట్టబెట్టినా మద్దతిచ్చారని అనుకొంటే పొరపాటేనని స్పష్టంచేశారు. ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఏకమై బీఆర్ఎస్ను నిలువరించాయని అన్ని పార్టీలు జట్టుకట్టి ఒక ఆడబిడ్డపై దాష్టీకానికి దిగాయని శ్రవణ్‌కుమార్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ విజయంలో రేవంత్‌రెడ్డి గొప్పతనమేమీలేదని దెప్పిపొడిచారు. భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో గెలుస్తా మనుకోవడం భ్రమేనని ఎద్దేవా చేశారు. శనివారం తెలంగాణ భవన్లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవారెడ్డి, పార్టీ నేత కురువ విజయ్‌కుమార్, గౌతంప్రసాద్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉప ఎన్నికలో అధికార పార్టీ గెలువడం సర్వసాధారణమని, కానీ ముఖ్యమంత్రి మాత్రం ప్రజల ఆమోదం లభించిందని నిస్సిగ్గుగా చెప్పుకొంటున్నారని విమర్శించారు.
బలముంటే అజార్‌కు టికెట్ ఎందుకివ్వలేదు?
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు అధికార యంత్రాంగం మద్దతు తప్ప ప్రజాబలం లేదని దాసోజు విమర్శించారు. నిజంగా బలముంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీచేసినా అజారుద్దీన్‌కు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత లేని వ్యక్తికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్ ఎన్నిక రేవంత్‌రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారడం.. తన పదవికి ఎసరొస్తుందనే భయంతోనే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. ఆయనతో పాటు 15మంది మంత్రులు, 60మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మోహరించి, డీజీపీ నుంచి మొదలు ఆర్వోల వరకు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి అడ్డదారిలో గెలిచారని ఆరోపించారు. ఒక్క ఎన్నిక కోసం రూ.200 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు.
ఇక్కడ ఓటు చోరీపై రాహుల్ సమాధానం చెప్పాలి
బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడుతున్నదని గగ్గొలు పెడుతూ దేశమంతా తిరుగుతున్న రాహుల్‌గాంధీ జూబ్లీహిల్స్‌లో జరిగిన ఓట్లచోరీపై సమాధానం చెప్పాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. లేదంటే ఆయన పోరాటంపై ప్రజల్లో అనుమానాలు వస్తాయనే విషయాన్ని విస్మరించవద్దని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో ఎంఐఎం అంటకాగుతున్న విషయం ఆయనకు తెలియదా? అని నిలదీశారు. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఎంఐఎంతో దోస్తీపై స్పందించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ గెలుపుతో ఉప్పొంగిపోతే రేవంత్‌రెడ్డికి ఒనగూరేదేమీ ఉండదని, ఇప్పటికైనా పాలనపై దృష్టి పెట్టి హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు. తాను విఫలమైతే సీఎం కుర్చీ కోసం మంత్రి పొంగులేటి, రాజగోపాల్‌రెడ్డి, భట్టి విక్రమార్క కాచుకుకూర్చున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
‘బండి’తో కుమ్మక్కు.. బీజేపీ ఓట్ల మళ్లింపు
కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో కుమ్మక్కయిన రేవంత్‌రెడ్డి బీజేపీ ఓట్లను కాంగ్రెస్‌కు మళ్లించారని శ్రవణ్ ఆరోపించారు. అందుకే పోలింగ్ ముందు విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్‌తో మాట్లాడించారని మండిపడ్డారు. నమ్మిన వారిని నట్టేట ముంచడం, అవమానించడం రేవంత్‌రెడ్డికి మొదటినుంచీ అలవాటేనని దెప్పిపొడిచారు. కంటోన్మెంట్లో గద్దర్ బిడ్డ వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన ఆయన.. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం నేతకు టికెట్ ఇప్పించి పార్టీకి చెందిన ఓ సెలబ్రిటీకి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. బీహార్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణమైన ఎంఐఎంను ఇక్కడ చేరదీయడం రేవంత్‌రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని నిప్పులుచెరిగారు.