హైదరాబాద్ జూన్ 14 (నమస్తేతెలంగాణ): ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతీకార నోటీసులను జారీ చేయిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ విమర్శించారు. ఆర్థిక దివాలా, చెల్లించని బిల్లులు, సంక్షేమ పథకాల రద్దు, నెరవేర్చని ఎన్నికల వాగ్దానాలు, అసమర్థ విధానాలు, అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ సర్కారు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని మండిపడ్డారు. బలవంతపు చర్యలు, ప్రతీకార నోటీసులు, అక్రమ కేసులు కేటీఆర్ లాంటి నాయకుడి సంకల్పాన్ని కదిలించలేవని శనివారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు.
కడిగిన ముత్యాల్లా తిరిగొస్తరు: సుంకె
కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 14: కేసీఆర్, కేటీఆర్‌పై కుట్రలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్యాల్లా తిరిగొస్తారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టంచేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, ఫార్ములా వన్ తదితర కేసులు పెడుతున్నదని, వీటిల్లో ఒక్కటి కూడా నిలిచేది కాదని తేల్చిచెప్పారు. ఈ నెల 25న రైతు భరోసా వేస్తామన్న మంత్రి తుమ్మల.. గతంలో మాదిరిగా కాలయాపన చేయొద్దని డిమాండ్ చేశారు.
హామీలపై ప్రశ్నిస్తే నోటీసులా?: కిషోర్‌గౌడ్
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు గురించి అడుగడుగునా ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీతో కేసులు పెట్టిస్తారా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కిషోర్‌గౌడ్ శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. కేటీఆర్‌పై మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడం దారుణమని పేర్కొన్నారు. పాలన చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మరల్చడం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను, హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలబెట్టేలా నాడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ విశేష కృషిచేశారని ఆయన కొనియాడారు.