హైదరాబాద్, జూన్ 18(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ‘తెలంగాణ రైజింగ్’, ‘3 ట్రిలియన్ ఎకానమీ’ అనే నినాదాలు అంతా డొల్ల అని, రేవంత్‌రెడ్డికి ఆర్థిక నిర్వహణ చేతకావడం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ ధ్వజమెత్తారు. మొదటి రెండు నెలల్లోనే రాష్ట్రాన్ని ఎంతటి ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోని నెట్టివేశారో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) గురువారం విడుదల చేసిన మే నెల నివేదిక ఆధారంగా పకా ఆధారాలు, అంకెలు సహా ఒక ప్రకటనలో వెల్లడించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన ముగిసేసరికి రూ.6,857.76 కోట్ల భారీ రెవెన్యూ మిగులు ఉంటుందని 2026-27 బడ్జెట్లో ప్రతిపాదించిందని, కానీ మే నాటికీ రూ.5,038.34 కోట్ల రెవెన్యూ లోటులోకి మునిగిపోయిందని తెలిపారు.
రెండు నెలల్లోనే 5వేల కోట్లకు పైగా ఖజానాను లోటులోకి నెట్టేసిన వాళ్లు రాష్ట్రాన్ని ఆర్థిక పవర్ హౌస్ చేస్తామనడం ప్రజలను దగా చేయడమేనని విమర్శించారు. బడ్జెట్లో వార్షిక రుణ సమీకరణ రూ.58,458.71 కోట్లు అని ప్రతిపాదించగా, మే నాటికే రూ.10,595.98 కోట్ల నికర అప్పులు చేసిందని మండిపడ్డారు. ఢిల్లీ దౌత్యం ఫెయిలయ్యిందని, సీఎం వారానికి రెండుసార్లు హస్తిన వెళ్తున్నా రాష్ట్రానికి పైసా లాభం రావడం లేదని, రెండు నెలల్లో వచ్చిన కేంద్ర గ్రాంట్లు రూ.544.99 కోట్లు (2.26శాతం) మాత్రమేనని ఆక్షేపించారు.
మద్యం మాయాజాలం
రాష్ట్రంలో ఏ గల్లీలో చూసినా వైన్‌షాపులు జనంతో కిటకిటలాడుతుంటే, ప్రభుత్వ ఖజానాకు రూ.3,348.55 కోట్లు (వార్షిక లక్ష్యంలో 12.10) మాత్రమే ఎందుకు వస్తున్నాయని దాసోజు ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల అండదండలతో షాడో లికర్ సిండికేట్లు ప్రభుత్వ సొమ్మును దోచేస్తున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. ప్రభుత్వ పాలనా సమర్థతకు నిదర్శనమైన పన్నేతర ఆదాయం కేవలం 5.05 శాతమే వచ్చిందని, ఇక భూముల ద్వారా వచ్చే ఆదాయం రూ.0.19 కోట్లు(1.70శాత)గా నమోదై దాదాపు శూన్యంగా మిగిలిందని ఆందోళన వ్యక్తంచేశారు. మరి డిక్లరేషన్లు, 420 హామీలను ఏ నిధులతో అమలు చేస్తారో ప్రజలకు సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు పెట్టి తక్షణమే అసెంబ్లీలో సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.