హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్సీలు స్పెషల్ మెన్షన్ కింద పలుసమస్యలపై తమ గళం వినిపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ..1000కి పైగా గురుకులాలు, 495 కేజీబీవీలు, 194 ఆదర్శ పాఠశాలల్లోని పిల్లలకు నాణ్యమైన భోజనం అందించడంలో ఎదురవుతున్న సమస్యలను రాజకీయం చేయడం తగదన్నారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్ విధానం, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ హామీతో కేంద్రం ఉత్తర్వుల అమలుతో కొంతమంది ఉద్యోగులకైనా మేలు చేయాలని, తద్వారా రూ.200 కోట్ల మేర నిధులు రాష్ర్టానికి అందుతాయన్నారు. చింతపండు నవీన్‌కుమార్ మాట్లాడుతూ.. నిమ్స్ దవాఖానలో 65 శాతం ఆంధ్రా ఉద్యోగులు అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, తెలంగాణ నిరుద్యోగులకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
టీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. హోంగార్డుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, ఎక్కడివారికి అక్కడే డ్యూటీలు ఇవ్వాలని, కారుణ్య నియామకాల్లో వారికి స్థానమివ్వాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టీ రవీందర్రావు మాట్లాడుతూ.. స్పెషల్ మెన్షన్‌లో లేవనెత్తిన సమస్యలపై ప్రభుత్వం నుంచి స్పందన లేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఎల్ రమణ మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుక మాఫియాపై చర్యలు లీసుకోవాలని కోరారు. కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో బలిదానమైన వారి కుటుంబాలకు రూ.20 వేల పింఛన్, ఇండ్ల స్థలం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. రజకుల కరెంటు బిల్లుల సమస్య పరిష్కరించాలని కోరారు. శేరి సుభాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. వనదుర్గ ప్రాజెక్ట్ ఆయకట్టుకు సాగునీటి విదుదలపై ప్రభుత్వం ప్రకటన చేయాలన్నారు. ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. టూరిజం పాలసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. బీ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కవులు, కళాకారుల ఉద్యోగ, ఉపాధి కల్పనపై చర్యలు తీసుకోవాలని కోరారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. ప్రీలాంచ్ ఆఫర్లతో అక్రమ వెంచర్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎగ్గె మల్లేశం మాట్లాడుతూ.. గొర్రెల స్కామ్ విచారణతో డీడీలు కట్టిన వారికి అన్యాయం జరుగుతుందని, వారికి న్యాయం చేయాలని కోరారు.
మంకెన కోటిరెడ్డి మాట్లాడుతూ.. నాగార్జునసాగర్ క్వార్టర్స్ రిజిస్ట్రేషన్ల వివాదం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద మంజూరైన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు అనుమతులివ్వాలన్నారు. మహ్మద్ అలీ మాట్లాడుతూ.. మైనార్టీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.