గద్వాల, సెప్టెంబర్ 8 : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 13న గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఏర్పాట్లను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడితో కలిసి మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ స్వరూపాన్నే పూర్తిగా మార్చామని తెలిపారు. దేశంలోనే తక్కువ అప్పులు ఉండి..
ఎక్కువ సంపద ఉన్న రాష్ట్రంగా నాటి పాలన సాగిందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ 21 నెలల పాలనలో రాష్ర్టాన్ని విధ్వంసం చేసిందని విమర్శించారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ.. ఈనెల 13న గద్వాల జిల్లాలో జరిగే కేటీఆర్ పర్యటనకు గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్లోనే బడుగు, బలహీన వర్గాలకు సముచిత స్థానం లభించిందని గుర్తు చేశారు.