 
                                                            హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అధికారిక హోదా లేకున్నా కాంగ్రెస్ నాయకులు పెత్త నం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడాని కి తాము టైం అడిగితే శుక్రవారం ఉదయం 11 గంటలకు టైం ఇచ్చారని, కానీ ఆయన అసెంబ్లీకి రాలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ రెండు గంటలకుపైగా అసెంబ్లీలో స్పీకర్ కోసం వేచిచూసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వటానికి అపాయింట్మెంట్ అడిగితే.. స్పీకర్ తమకు టైం ఇచ్చి మరీ అందుబాటులోకి రాలేదని తెలిపారు. స్పీకర్ మళ్లీ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు కలిసి ప్రివిలేజ్ మోషన్ ఇస్తామన్నారు.
వారిపై చర్యలు తీసుకొనేవరకు ఊరుకోను: కౌశిక్‌రెడ్డి
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ తమకు ఉదయం 11 గంటలకు టైం ఇచ్చారని, ఒంటి గంట వరకు ఎదురు చూశామని, ఎన్నిసార్లు ఫోన్‌చేసినా అందుబాటులోకి రాలేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో అధికారులు యథేచ్ఛగా ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విద్యాశాఖపై రివ్యూ మీటింగ్ పెడితే తనపై క్రిమినల్ కేసు పెట్టారని తెలిపారు.
కరీంనగర్ డీఈవో, జడ్పీ సీఈవోపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడానికి స్పీకర్‌ను కలవాలని అనుకున్నామని వెల్లడించారు. డీఈవోను సస్పెండ్ చేసే వరకు, జడ్పీసీఈవోపై చర్యలు తీసుకునే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు. అధికారుల తీరు వల్ల కల్యాణలక్ష్మి చెకులు బౌన్స్ అవుతున్నాయని వాపోయారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కేసులు పెడితే భయపడేవాడిని కాదని, జైలుకు పోవడానికి సిద్ధమేనని తేల్చిచెప్పారు.
అధికారం ఉందని విర్రవీగొద్దు: కల్వకుంట్ల సంజయ్ 
కేసీఆర్‌పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కేసీఆర్‌ను తిడితే గొప్ప నాయకుడు కాలేవనే విషయాన్ని తెలుసుకోవాలని చురక అంటించారు. అధికారం ఉన్నదని విర్ర వీగొద్దని, కేసీఆర్ ఉద్యమం చేసినపుడు ఆది శ్రీనివాస్ ఎకడున్నారని ప్రశ్నించారు.
 
                            