Telangana | రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను రైతాంగం ముక్తకంఠంతో ఖండించింది. కాంగ్రెస్ పాలనలోని కరెంటు జాగారాలు మళ్లీ తమకొద్దని.. 24 గంటల కరెంట్‌తో ఏడాదికి 3 పంటలు పండించేలా కడుపులోపెట్టుకుని చూసుకుంటున్న బీఆర్ఎస్ పాలనే కావాలని నినదించింది. రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం నాలుగోరోజు కూడా గ్రామాల్లో రైతు వేదికల వద్ద రైతులు సమావేశాలు నిర్వహించారు. కరెంటుపై కాంగ్రెస్ నేతల కుట్రలను ఎండగట్టారు. ఈ మేరకు పలు తీర్మానాలు చేశారు.
న్యూస్‌నెట్‌వర్క్, జూలై20 (నమస్తేతెలంగాణ): ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల సాక్షిగా అన్నదాతలు రేవంత్ కరెంటు వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన ముక్కు నేలకు రాసి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘3 గంటల కాంగ్రెస్ మాకొద్దు.. 3 పంటల బీఆర్ఎస్సే ముద్దు’ అంటూ తీర్మానాలు చేశారు. రేవంత్‌కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ నాయకులను తరిమికొడుతామని తేల్చిచెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్, జమ్మికుంట మండలాల్లో నిర్వహించిన రైతు సమావేశాలకు రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి హాజరై.. ఉచిత కరెంట్‌పై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ చేసిన తీర్మానాన్ని ఆమోదించారు.
మల్యాల రైతు వేదికలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల, ఓదెల మండలం గుండ్లపల్లి, కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల రైతు వేదికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం బ్రహ్మణపల్లి రైతు వేదికలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నారాయణపేట జిల్లా పేరపళ్ల, దామరగిద్ద మండలం కంసాన్పల్లి రైతువేదికల్లో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా లింగనవాయి గ్రామం రైతు వేదికలో అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం, నిజామాబాద్ రూరల్ మండలంలోని గుండారం గ్రామ రైతువేదికలో ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామం రైతు వేదికలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా.. హుజూర్‌నగర్‌లోని శ్రీనివాసపురం రైతు వేదికలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, మిర్యాలగూడ మండలం ఆలగడప, కొత్తగూడెం రైతు సమావేశంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, చందంపేట మండలం పోలేపల్లి, దేవరకొండ మండలం తాటికోల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, అనంతగిరి మండల కేంద్రంలోని రైతు వేదికలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ పాల్గొన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతులు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే. ఆ పంటలు చూడలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కోకొల్లలుగా చూశాం. ప్రజలు మరోసారి మోసపోవద్దు. కాంగ్రెస్‌ను నమ్మి ఓట్లేస్తే.. అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంటు కోతలు తప్పవు.
– అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి,అటవీ శాఖ మంత్రి
ప్రధానంగా రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేకి. నిరంతర విద్యుత్తు సరఫరాపై ఆయనవి పసలేని వ్యాఖ్యలు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని, తెలంగాణలోనూ అధికారంలోని వస్తుందని రేవంత్ పగటి కలలు కంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆటలు నడవవు. ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ వైఖరి మార్చుకోవాలి. లేకుంటే తెలంగాణ రైతులు, ప్రజలు తగిన సమయంలో గుణపాఠం చెప్తారు.
-సత్యవతి రాథోడ్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి