హైదరాబాద్, జనవరి 18(నమస్తే తెలంగాణ): అహంకారానికి ప్రతీక అయిన రేవంత్‌రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ బహిషరణ చేయడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నోట్లకట్టల బ్యాగులతో దొరికిన దొంగ, నేడు కేసీఆర్‌పై మాట్లాడేస్థాయికి రావడం దురదృష్టకరమని మండిపడ్డారు. కేసీఆర్ కాలిగోటికి కూడా రేవంత్‌రెడ్డి సరిపోడని ఎద్దేవాచేశారు. బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చాలంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితం, అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ సమావేశంలో తన పాత పార్టీ జ్ఞాపకాలను విడిచిపెట్టలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పే కాంగ్రెస్‌లో ఉంటూనే, బీజేపీతో పొత్తు ఉన్న టీడీపీకి భజన చేయడం ఏమిటో కాంగ్రెస్ శ్రేణులు ఆలోచించుకోవాలని సూచించారు. గల్లీలో చంద్రబాబు, ఢిల్లీలో మోదీ జపం చేస్తూ వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రేవంత్‌రెడ్డి గతాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోరని గుర్తుచేశారు.