Prashanth Reddy | హైదరాబాద్ : అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సమావేశం ప్రారంభమైంది. పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. సమావేశానికి శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. అయితే పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ సభ్యులు బహిష్కరించారు. చైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీధర్ బాబును నిలదీశారు. పీఏసీ ఎంపిక తీరును నిరసిస్తూ బహిష్కరించామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పీఏసీ ఎంపీ అప్రజాస్వామికంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు. పీఏసీ చైర్మన్ ఎంపిక సమయంలో ప్రతిపక్ష నేతను సంప్రదించలేదు. పీఏసీ చైర్మన్‌ను ఎన్నుకోలేదు.. ఎంపిక చేశారని ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవిని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి కట్టబెట్టడం తీవ్ర వివాదాస్పదమవుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని, గతంలో ఎన్నడూలేనివిధంగా సభా సంప్రదాయాలు, సభా మర్యాదలు, సభా నియమావళిని పట్టించుకోకుండా అరికెపూడి గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
రాష్ట్ర శాసనసభలో మూడు కమిటీలు ఆర్థికపరమైన అంశాలకు సంబంధించినవి ఉంటాయి. వీటిలో ప్రధానమైనది ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ). దీనికి తొమ్మిది మంది సభ్యులను శాసనసభ ఎన్నుకుంటుంది. పార్టీలకు ఉండే బలాబలాలను బట్టి పీఏసీలో స్థానాలు దక్కుతాయి. చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి ఇస్తారు. ఇది శాసనసభ నియమావళిలోనే ఉంటుంది. అయితే, శాసనసభ నియమావళిని, పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తిని దెబ్బతీసేలా తొలిసారి అధికార పార్టీలో చేరిన ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా చేయడం బహుశా దేశంలోనే తొలిసారి.
ప్రశాంత్ రెడ్డి వేముల, గంగుల కమలాకర్, రావూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రామ్ రావు పవార్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, భాను ప్రసాద్ రావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్.
ఇవి కూడా చదవండి..
Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని బొగ్గుపాలు చేసిన రేవంత్ సర్కార్..!
KTR | అమృత్ స్కీంలో భారీ స్కాం.. సీఎం కుటుంబ సభ్యులకు రూ. 1,500 కోట్ల కాంట్రాక్టులు : కేటీఆర్