సూర్యాపేట, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను స్పీకర్ డిస్మిస్ చేయడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి తప్పుబట్టారు. ఈ చర్య రాజ్యాంగాన్నే అవహేళన చేసినట్టుగా భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. బుధవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన వారిని స్పీకర్ వదిలినా కోర్టులో శిక్ష తప్పదని పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపు విషయంలో స్పీకర్ చట్టపరంగా కానీ, ఆత్మసాక్షిగా కానీ పని చేయడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యేలు బహిరంగంగా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్న విషయం రాష్ట్రమంతా కనిపిస్తున్నా స్పీకర్‌కు మాత్రమే కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని అన్నారు. స్పీకర్ ఏకపక్ష నిర్ణయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఆయన ఆత్మసాక్షిగా, చట్టపరంగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పడం ఖాయమని స్పష్టంచేశారు.