హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): మంత్రి హరీశ్‌రావుపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగా హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అభివర్ణించారు. ‘మా ఆత్మగౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు. మంత్రి హరీశ్‌రావుపై ఏపీ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. హరీశ్‌రావు దేశంలోని మంత్రులందరికీ ఆదర్శమని తెలిపారు. ఏపీలో ఎవరిని అడిగినా హరీశ్‌రావు గురించి చెప్తారని, పనిచేయటంలో రోబో లాంటి వారని పేరున్నదని గుర్తుచేశారు. ఆయనమీద మాట్లాడేటప్పుడు వందసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు.
తెలుగు రాష్ర్టాల్లో అభివృద్ధి ఎక్కువగా ఎక్కడ జరిగిందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా చర్చలో హరీశ్‌ను ఎదుర్కోలేరని చెప్పారు. తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలే అకడి మంత్రులను చీదరించుకుంటారని హెచ్చరించారు. విషయం లేకనే ఏపీ మంత్రులు రెచ్చి పోతున్నారని మండిపడ్డారు. ‘మాతో అభివృద్ధిలో పోటీ పడండి’ అని సవాల్ చేశారు.
ఏపీ మంత్రి సీదిరి అప్పల రాజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఆయన ‘చీదర అప్పలరాజు’గా మారారని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణ, ఏపీలో అభివృద్ధిపై తనతో ఏపీ మంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంత్రి హరీశ్‌రావుపై అవాకులు చెవాకులు పేలితే.. ఆంధ్ర సమాజం మిమ్మల్ని క్షమించదని ఏపీ మంత్రులను వాసుదేవరెడ్డి హెచ్చరించారు. ఆంధ్రా నేతల అసమర్థత వల్లే అక్కడి జనం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ మొదటి నుంచీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నదని తెలిపారు.