హైదరాబాద్ : పట్టణ ప్రగతితో పట్టణాలు మెరుస్తున్నాయి.. ఇది ఒక వినూత్న కార్యక్రమం అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమం కూడా తూతూ మంత్రంగా ఉండదే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు కావోస్తున్నా పట్టణాలు అభివృద్ధికి దూరంగా ఉండటం శోచనీయమన్నారు. కానీ సీఎం కేసీఆర్ పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో జీవన ప్రమాణాలను పెంచేందుకు కేసీఆర్ ఎంతో ముందుచూపుతో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పచ్చదనం, మెరుగైన పారిశుద్ధ్యం, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, హరితహారం మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులు, అంగన్వాడీ సెంటర్లలో మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతో అవసరమన్నారు. పట్టణీకరణలో తెలంగాణ ఐదో స్థానంలో ఉందన్నారు. దేశంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతన్న నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు. మెరుగైన జీవనం కోసం ప్రజలు పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో పట్టణాల్లో సురక్షిత మంచినీరు అందించడమే కాకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. పట్టణాల అభివృద్ధి కోసం గతంలో ఎన్నో చట్టాలు వచ్చాయి.. కానీ అమలు కాలేదు. పాత చట్టాల్లో మార్పులు చేయాలని గుర్తించిన సీఎం కేసీఆర్.. కొత్త చట్టాలను తీసుకొచ్చి పట్టణాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రణాళికబద్ధంగా అభివృద్ధి జరగాలి. ఆ క్రమంలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తెలిపారు.