MLA Rammohan Reddy | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీలో కాంగ్రెస్‌కు చెందిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తొడగొట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఏ క్షణమైనా పడిపోతుందంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతల నుంచి సవాళ్లు వస్తూన్నాయని, మీరు ప్రభుత్వాన్ని పడగొడతాం.. అంటే మేము తొడగొడతాం’ అని అంటూ రామ్మోహన్‌రెడ్డి తొడగొట్టి మరీ చూపించారు. దీంతో సభలో ప్రతిపక్షాల నుంచే కాకుండా వివిధ ప్రజాసంఘాల నేతలు సహా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. అంతకు ముందు బడ్జెట్ కాపీని చదువుతూ అందులో పొందుపరచిన పదాలను సరిగా పలకలేకపోయారు. రుణాల మాఫీ బదులు రణాల మాఫీ అని, మురుగునీటి శుద్ధి బదులు మరుగు శుద్ధి అంటూ పలు తప్పులను పలకడంతో సభలో పలువురు నవ్వుకున్నారు.
వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటుచేయడం వల్ల తీవ్ర నష్టం జరిగిందన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొనడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. రామ్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలు వింటుంటే వికారాబాద్‌ను మళ్లీ రంగారెడ్డిలో కలిపేలా ఉన్నదని, అదే ప్రభుత్వ అభిప్రాయమా? దీనిపై ప్రభుత్వ వైఖరిని తేల్చాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున జిల్లాలను ఏర్పాటు చేయాలని, జిల్లాల విభజనపై కమిటీ వేయాలని పరిగి ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం గమనార్హం.
రుణమాఫీ కోసం మళ్లీ అర్జీలెందుకని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ప్రసంగి స్తూ రుణమాఫీ రాని రైతు లు మళ్లీ ఎమ్మెల్యేలను కలి సి అర్జీలు పెట్టుకోవాలని సూచించారు. రుణమాఫీపై ప్రభుత్వం ఒక విధాన విధానాన్ని అమలులోకి తెచ్చాక కొందరి రుణాలు మాఫీ కావడం, మరికొందరివి కాకపోవడం ఏమిటని సునీత నిలదీశారు. మాఫీ కాని వారు మళ్లీ అర్జీలు పెట్టుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రుణమాఫీ కాని రైతులు వేలల్లో ఉన్నారని గుర్తుచేశారు. తన నియోజకవర్గంలోని పలు గ్రామాలను ఆమె ఉదహరించారు.